యాయీరు కుమార్తె, క్రీస్తు వస్త్రాన్ని తాకిన స్త్రీ
తిరిగి వచ్చినప్పుడు యేసు యాయీరు కుమార్తెను, క్రీస్తు వస్త్రాన్ని కేవలం తాకిన స్త్రీని బాగుచేస్తాడు.
బహుశా కపెర్నహూము
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 9:18–26
9:18 ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
19 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
20-21 అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది.
22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు.
24 “వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు. 25 ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది.
26 ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
మార్కు రాసిన సువార్త 5:21–43
5:21 యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది.
22 అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి 23 “నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు.
24 యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
25 పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
27 యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
30 వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు.
31 ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు. 32 కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
33 ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
34 ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు.
35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు. 36 యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.
37 అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు.
38 ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు.
39 ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు.
40 కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు.
41 ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.
42 వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. 43 ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.
లూకా రాసిన సువార్త 8:40–56
8:40 ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు.
41 అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు.
42 సుమారు పన్నెండేళ్ళ వయసున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు.
43 అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు.
44 ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
45 యేసు, “నన్ను తాకిందెవరు?” అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు.
46 అయితే యేసు, “ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది” అన్నాడు. 47 ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది.
48 అందుకు ఆయన, “అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు.
49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు.
50 యేసు ఆ మాట విని, “భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది” అని చెప్పాడు.
51 అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు.
52 అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో, “ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు” అన్నాడు. 53 ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు.
54 అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, “అమ్మాయీ, లే” అని చెప్పగానే
55 ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన, “ఆమెకు భోజనం పెట్టండి” అని ఆదేశించాడు. 56 ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆయన, “జరిగింది ఎవరికీ చెప్పవద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
యేసు ఇద్దరు గుడ్డివారిని, ఒక మూగవాణ్ణి బాగుచేయడం
యేసు ఇద్దరు గుడ్డివారిని, దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి బాగుచేసి, దైవదూషణకరమైన ఆరోపణను ఎదుర్కొంటాడు.
మత్తయి రాసిన సువార్త 9:27–34
9:27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. 29 అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. 30 వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు. 31 కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
32 ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. 33 దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు. 34 అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.
యేసు చివరిసారి నజరేతును సందర్శించడం
మత్తయి రాసిన సువార్త 13:54–58
13:55 ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా? 56 ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి?” అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.
57 అయితే యేసు, “ఒక ప్రవక్త తన స్వదేశంలో, తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు” అని వారితో చెప్పాడు.
58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
మార్కు రాసిన సువార్త 6:1–6
6:1 యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు 2 విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
3 ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
4 యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. 5 అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
6 వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.