పైకప్పు గుండా దింపిన ఒక పక్షవాత రోగిని యేసు స్వస్థపరచడం
కపెర్నహూములో జనసమూహాలు తన చుట్టూ క్రిక్కిరిసి ఉండగా, పేతురు ఇంటి పైకప్పు గుండా దింపిన ఒక పక్షవాత రోగిని యేసు స్వస్థపరుస్తాడు.
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 9:1–8
9:1 యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
2 కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.
3 ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.
4 యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు?
5 ‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? 6 అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
7 అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
8 ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
మార్కు రాసిన సువార్త 2:1–12
2:1 కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. 2 ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
3 నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. 4 ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
5 యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, 7 “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?”
8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?
9 ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా?
10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి 11 ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
లూకా రాసిన సువార్త 5:17–26
5:17 ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది.
18 కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని 19 ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
20 యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
21 శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు
22 యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
23 ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా?
24 అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు.
తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
25 వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
26 అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.