యేసు మత్తయిని పిలవడం, మత్తయి ఆయనకు విందు ఏర్పాటు చేయడం
యేసు మత్తయి (లేవి)ని పిలుస్తాడు; అతడు యేసు గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తాడు.
కపెర్నహూము
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 9:9–13
9:9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
10 యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.
11 పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు.
12 యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. 13 నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.
మార్కు రాసిన సువార్త 2:13–17
2:13 యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు.
14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
15 యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.
16 అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు.
17 యేసు ఈ మాట విని వారితో, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను” అని అన్నాడు.
లూకా రాసిన సువార్త 5:27–32
5:27 ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు.
28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
29 లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
30 పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు.
31 అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. 32 పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.
ఉపవాసం చేయని తన శిష్యులను సమర్థించిన యేసు
తన శిష్యులు ఉపవాసం చేయకుండా విందు చేసుకోవడాన్ని యేసు మూడు ఉపమానాలతో సమర్థిస్తాడు.
మత్తయి రాసిన సువార్త 9:14–17
9:14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు.
15 యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.
16 “ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది.
17 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”
మార్కు రాసిన సువార్త 2:18–22
2:18 యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, “యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?” అని ఆయనను అడిగారు.
19 యేసు, “పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లి వారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు.
20 పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు.
21 “పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.
22 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి” అని వారితో అన్నాడు.
లూకా రాసిన సువార్త 5:33–39
5:33 వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు.
34 అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా?
35 పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.
36 ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
37 ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి. 38 అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి. 39 పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు. ఎందుకంటే ‘పాతదే బాగుంది,’ అంటారు.”