పేతురు అత్తను, మరెంతో మందిని యేసు స్వస్థపరచడం

కపెర్నహూములో, పేతురు ఇంట్లో

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 8:14–17

8:14 తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు.

15 యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.

16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు.

17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

“ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు.

మన రోగాలను భరించాడు.”

మార్కు రాసిన సువార్త 1:29–34

1:29 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.

30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.

31 ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.

32 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.

33 ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.

34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

లూకా రాసిన సువార్త 4:38–41

4:38 ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు.

39 ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.

40 పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.

41 వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.

నలుగురు జాలరులతో కలిసి యేసు గలిలయలో మొదటిసారి పర్యటించడం

ఇక్కడ యేసు నలుగురు జాలరులతో కలిసి గలిలయలో తన మొదటి పర్యటన చేస్తాడు; తనను నిరంతరం అనుసరించమని ఆయన ఇప్పుడు వారిని పిలిచాడు. కపెర్నహూముకు తిరిగి వచ్చేటప్పుడు మత్తయికి పిలుపు వస్తుంది; వివిధ అద్భుతాలు జనసమూహాల్లో ఉత్సాహాన్ని, క్రీస్తు బోధల పట్ల పరిసయ్యుల్లో విరోధాన్ని రేకెత్తిస్తాయి.

మత్తయి రాసిన సువార్త 4:23–25

4:23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. 24 ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు. 25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.

మార్కు రాసిన సువార్త 1:35–39

1:35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36 సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.

37 ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38 ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.

39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.

లూకా రాసిన సువార్త 4:42–44

4:42 తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు.

43 అయితే ఆయన, “నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాడు” అని వారితో చెప్పాడు.

44 ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు.

యేసు ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం

ఒక కుష్ఠరోగి స్వస్థత పొందుతాడు; ప్రజల్లో ఎంతో ఉత్సాహం కలుగుతుంది.

మత్తయి రాసిన సువార్త 8:2–4

8:2 ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు.

3 యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.

4 అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 1:40–45

1:40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.

41 యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.

43 ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44 “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.

45 కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

లూకా రాసిన సువార్త 5:12–16

5:12 యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు.

13 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.

14 “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు.

15 అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు. 16 అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.