భాగం 8: గలిలయ చుట్టుపక్కల యేసు పన్నెండుమందికి శిక్షణ ఇవ్వడం

గలిలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్నెండుమందికి ప్రత్యేక శిక్షణ.

బహుశా క్రీ.శ. 29లో పస్కా పండగ నుండి క్రీ.శ. 29లో పర్ణశాలల పండగ సమీపించే వరకు, లేదా ఒక సంవత్సరం ముందుగా (వసంతకాలం నుండి శరదృతువు వరకు ఆరు నెలలు). ఈ కాలం ప్రారంభం నుండి సిలువ వేయడం వరకు కేవలం ఒక సంవత్సరం. ఇప్పుడు రాజ్యానికి రాజుపై (మెస్సీయ అనే వ్యక్తిపై) ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమవుతుంది

గలిలయ నుండి వేరువేరు సందర్భాల్లో నాలుగుసార్లు ఏకాంతానికి వెళ్లడం ఇక్కడ ఇవ్వబడింది. ప్రతిసారీ ఆయన హేరోదు భూభాగానికి దూరంగా ఉంటాడనీ, ప్రతిసారీ కొండలకు వెళ్తాడనీ గమనించండి.

యేసు ఐదువేలమందికి ఆహారం పెట్టడం

మొదటిసారి ఏకాంతానికి వెళ్లడం: పన్నెండుమంది తిరిగి వస్తారు. యేసు వారితో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి సరస్సు అవతలకు వెళ్తాడు. ఐదువేలమందికి ఆహారం పెట్టడం.

క్రీ.శ. 29 లేదా 28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 14:13–21

14:13 యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు.

14 యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.

15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు.

16 యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు.

17 వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు.

18 అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.

19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.

20 వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.

21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.

మార్కు రాసిన సువార్త 6:30–44

6:30 అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.

31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

32 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.

33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.

34 పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.

35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది.

36 ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు.

37 అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు.

38 ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు.

39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.

40 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.

41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.

42 అందరూ తిని సంతృప్తి చెందారు.

43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.

44 ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.

లూకా రాసిన సువార్త 9:10–17

9:10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు.

11 జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.

12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు.

13 ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.

14 అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు.

15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.

16 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు.

17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.

యోహాను రాసిన సువార్త 6:1–13

6:1 ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.

2 రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు. 3 యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.

4 యూదుల పస్కా పండగ దగ్గర పడింది.

5 యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.

6 యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. 7 దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.

8 ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ

9 “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.

10 యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.

11 యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.

12 అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.

13 అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.