అపరాధభావంతో యేసు గురించి హేరోదుకు కలిగిన భయాలు
మకేరులో బాప్తిసమిచ్చే యోహాను తల నరికించినందుకు, తిబెరియలో ఉన్న హేరోదు అంతిపాకు అపరాధభావంతో యేసు గురించి భయాలు కలుగుతాయి.
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 14:1–12
14:1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని, 2 “ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు.
3 అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు
4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు. 5 హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు. 8 తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు.
10 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
12 యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
మార్కు రాసిన సువార్త 6:14–29
6:14 యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.
15 ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు.
16 కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు.
17 ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
18 ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు. 19 అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది. 20 ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.
23 “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.
24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది. 25 వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది.
26 రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు.
లూకా రాసిన సువార్త 9:7–9
9:7 జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు ‘యోహాను చనిపోయి లేచాడు’ అనీ,
8 మరి కొందరు ‘ఏలీయా కనిపించాడు’ అనీ, ఇంకొంతమంది ‘పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు’ అనీ చెప్పుకుంటూ ఉన్నారు.
9 అప్పుడు హేరోదు ‘నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో’ అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు.