యేసును రాజుగా చేయాలనే ప్రయత్నం ఆగిపోవడం

యేసును రాజుగా (రాజకీయ మెస్సీయగా) ప్రకటించే విప్లవాత్మక పథకం అడ్డుకోబడుతుంది.

క్రీ.శ. 29 లేదా 28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 14:22–23

14:22 యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.

23 ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.

మార్కు రాసిన సువార్త 6:45–46

6:45 ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.

46 జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు.

యోహాను రాసిన సువార్త 6:14–15

6:14 వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.

15 వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.

క్రీస్తు నీటిపై పన్నెండుమంది దగ్గరికి రావడం

సముద్రంలో తుఫాను వల్ల పన్నెండుమంది ప్రమాదంలో ఉంటారు; చీకటిలో క్రీస్తు నీటిపై వారి దగ్గరికి వస్తాడు.

మత్తయి రాసిన సువార్త 14:24–33

14:24 అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.

25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.

26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27 వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. 28 పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. 29 యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30 గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.

32 యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. 33 అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.

మార్కు రాసిన సువార్త 6:47–52

6:47 చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు.

48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,

49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.

51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు. 52 ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.

యోహాను రాసిన సువార్త 6:16–21

6:16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.

17 అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు. 18 అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.

19 వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు. 20 అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.

21 ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.

గెన్నేసరెతులో యేసుకు స్వాగతం లభించడం

మత్తయి రాసిన సువార్త 14:34–36

14:34 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.

35 అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. 36 “వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.

మార్కు రాసిన సువార్త 6:53–56

6:53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు. 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు. 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు.

56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.