ప్రజల విశ్వాసభ్రష్టతను యిర్మీయా గద్దించడం
యోషీయా సంస్కరణ తరువాత ప్రజలు విశ్వాసం నుండి వైదొలగినందుకు యిర్మీయా వారిని గద్దిస్తాడు.
క్రీ.పూ. 612
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.
“ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.
7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.
8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
9 రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.
10 ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.
11 కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది. 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు.
13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు.
నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.
14 చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు
ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.
15 నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు.
16 ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు. 17 ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు. 18 ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.
19 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను.
నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను.
20 అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా,
నిజంగా మీరు నాపట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు.
21 వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది.
వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.
22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను.
“మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
23 నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్ప్రయోజనం.
నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది.
24 మా బాల్యంనుండి మా పూర్వీకుల కష్టార్జితాన్నంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి.
వారి గొర్రెల్నీ పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి.
25 మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం.
కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.
చెరలోని దుఃఖాలను యిర్మీయా ముందుగా చూడడం
రాబోయే చెరలోని దుఃఖాలను యిర్మీయా ప్రవక్తగా ముందుగానే వర్ణిస్తాడు.
1 యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి.
మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
2 యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే,
జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
3 యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
4 యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
5 యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.” 6 సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.
7 పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు. 8 యెహోవా కోపాగ్ని మన మీద నుండి తొలగిపోలేదు. కాబట్టి గోనె పట్ట కట్టుకోండి. రోదనతో విలపించండి.
9 యెహోవా చెప్పేదేమంటే “ఆ రోజు రాజూ అతని అధికారులూ ధైర్యం కోల్పోతారు. యాజకులు నిర్ఘాంతపోతారు. ప్రవక్తలు విస్మయానికి గురౌతారు.” 10 అప్పుడు నేనిలా అన్నాను “అయ్యో, ప్రభూ యెహోవా! ‘మీకు క్షేమంగా ఉంటుంది’ అని చెప్పి యెరూషలేము ప్రజలను మోసం చేశావు. ఇప్పుడేమో ఖడ్గం వారి ప్రాణాల మీద పడి హతం చేస్తూ ఉంది.”
11 ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు. 12 నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.” 13 ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
14 యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు? 15 దాను పట్టణం నుండి ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు రాబోతున్నదని ఎఫ్రాయిము కొండల్లో ఒకడు చాటిస్తున్నాడు, 16 దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి “యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం” అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి. 17 యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
18 నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా? 19 నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను. 20 కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి. 21 ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ, బాకానాదం వింటూ ఉండాలి? 22 నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
23 నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు. 24 పర్వతాలను చూస్తే అవి కంపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి. 25 నేను చూసినప్పుడు మనిషి ఒక్కడు కూడా లేడు. ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి. 26 నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.
27 యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను. 28 దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను. 29 రౌతులూ విలుకాళ్ళూ చేసే శబ్దం విని పట్టణ ప్రజలంతా పారిపోయి అడవుల్లో దూరుతున్నారు, ఉన్నత ప్రాంతాల్లో రాళ్ళ మధ్యకు ఎక్కుతున్నారు. ప్రతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. వాటిలో ఎవరూ నివసించడం లేదు.
30 నీవు ధ్వంసం అయ్యావు. ఏమి చేయగలవు? ఎరుపు రంగు బట్టలు కట్టుకుని, బంగారు నగలు ధరించి, కాటుకతో నీ కళ్ళు పెద్దగా కనబడేలా చేసుకున్నావు, నీ అలంకరణ అంతా వ్యర్ధం. ఇంతకు ముందు నిన్ను ప్రేమించిన వారు నిన్ను తృణీకరిస్తారు. పైగా వారే నిన్ను చంపడానికి చూస్తారు. 31 స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.