యోషీయా మత సంస్కరణ
క్రీ.పూ. 624
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
4 రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు. 5 ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు.
6 యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, ఆ బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు. 7 ఇంకా యెహోవా మందిరంలో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు.
8 యూదా పట్టణంలో ఉన్న యాజకులందర్నీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెయేర్షెబా వరకూ యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి, పట్టణ ద్వారానికి ఎడమ వైపు పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించాడు. 9 ఆ ఉన్నత స్థలాలమీద యాజకులుగా ఉన్న వారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చెయ్యడానికి అనుమతి లేకపోయినా, తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది.
10 ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు. 11 ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.
12 ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు. 13 యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు. 14 ఆ రూపాలను ముక్కలుగా కొట్టించి, అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు.
15 బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు. 16 యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు.
17 అప్పుడు అతడు “నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది?” అని అడిగాడు. పట్టణం వారు “అది యూదా దేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి” అని చెప్పారు. 18 అందుకతడు “దాన్ని తప్పించండి. ఎవరూ అతని ఎముకలను తీయకూడదు” అని చెప్పాడు. వారు అతని ఎముకలను, షోమ్రోను పట్టణం నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు.
19 ఇంకా, ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఏ ఉన్నతస్థలాల్లో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో, ఆ మందిరాలన్నిటినీ యోషీయా తీసేసి, తాను బేతేలులో చేసినట్టే వాటికీ చేశాడు. 20 అక్కడ అతడు ఉన్నతస్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి, వాటిమీద మనుషుల ఎముకలను తగలబెట్టించి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
21 అప్పుడు రాజు “నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి” అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు.
33 యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలోనుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.
యోషీయా పస్కాపండగను ఆచరించడం క్రీ.పూ. 623
పస్కాపండగ వేడుక.
1 యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కాపండగ ఆచరించాడు. మొదటి నెల 14 వ రోజున ప్రజలు పస్కా పశువును వధించారు. 2 అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవా మందిరసేవను జరిగించడానికి వారిని ధైర్యపరచి 3 ఇశ్రాయేలీయులందరికి బోధిస్తూ, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు “పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా, ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.
4 ఇశ్రాయేలీయుల రాజు దావీదు రాసి ఇచ్చిన క్రమం ప్రకారం, అతని కొడుకు సొలొమోను రాసి ఇచ్చిన క్రమం ప్రకారం మీ మీ పూర్వీకుల కుటుంబాలకు ఏర్పాటైన వరసలనుబట్టి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి.”
5 మీరు పరిశుద్ధ స్థలం లో నిలిచి, ప్రజల, పూర్వీకుల కుటుంబాల వరసలను బట్టి లేవీయుల పూర్వీకుల కుటుంబాల్లో ఉన్న వంతుల ప్రకారం సేవకు నిలబడండి. 6 పస్కా గొర్రె పిల్లను వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొనండి. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దాన్ని మీ సోదరుల కోసం సిద్ధపరచండి.
7 యోషీయా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ 3,000 కోడెదూడలనూ అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసం ఇచ్చాడు. 8 అతని అధికారులు ప్రజలకూ, యాజకులకూ, లేవీయులకూ మనసారా ఇచ్చారు. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలూ పస్కాబలి కోసం యాజకులకు 2, 600 చిన్న పశువులనూ 300 కోడెదూడలనూ ఇచ్చారు. 9 కొనన్యా, అతని సోదరులైన షెమయా, నెతనేలూ, లేవీయుల్లో ముఖ్యులు హషబ్యా యెహీయేలూ యోజాబాదూ పస్కాబలి కోసం లేవీయులకు 5,000 గొర్రెలనూ 500 కోడెదూడలనూ ఇచ్చారు.
10 సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలం లోనూ, లేవీయులు తమ వరసల్లోనూ నిలబడ్డారు. 11 లేవీయులు పస్కాపశువులను వధించి రక్తాన్ని యాజకులకిచ్చారు. వారు దాన్ని చల్లారు. లేవీయులు జంతువుల చర్మాలను ఒలిచారు. 12 మోషే గ్రంథంలో రాసినట్టు ప్రజల వంశాల ప్రకారం పంచిపెట్టడానికీ యెహోవాకు అర్పణగా ఇవ్వడానికీ దహనబలి మాంసాన్ని యాజకులు పక్కన ఉంచారు. వారు ఎడ్లను కూడా అలాగే చేశారు.
13 వారు యధావిధిగా పస్కా గొర్రెపిల్లలను నిప్పుమీద కాల్చారు. ఇతర ప్రతిష్ఠార్పణలను కుండల్లో భాండీల్లో పెద్ద బిందెల్లో ఉడికించి ప్రజలందరికీ త్వరగా వడ్డించారు. 14 తరువాత లేవీయులు తమ కోసం, యాజకుల కోసం అర్పణ సిద్ధం చేశారు. అహరోను సంతతివారైన యాజకులు దహనబలి అర్పణలనూ కొవ్వునూ రాత్రి వరకూ అర్పించ వలసి వచ్చింది కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను సంతతివారైన యాజకుల కోసం అర్పణలను సిద్ధపరిచారు.
15 ఆసాపు సంతతివారైన గాయకులు, తమ స్థలాల్లో ఉన్నారు. ఆసాపూ, హేమానూ, రాజుకు దార్శనికుడైన యెదూతూనూ దావీదు నియమించినట్టుగా తమ స్థలం లో ఉన్నారు. ప్రతి గుమ్మం దగ్గరా ద్వారపాలకులున్నారు. వారు తమ పని విడిచి రాకుండా వారి సోదరులైన లేవీయులు వారి కోసం అర్పణ సిద్ధపరిచారు. 16 కాబట్టి రాజైన యోషీయా ఆజ్ఞాపించిన ప్రకారం వారు పస్కాపండగ ఆచరించి, యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం వలన ఆ రోజు ఏ లోపం లేకుండా యెహోవా సేవ జరిగింది. 17 అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు, ఆ సమయంలో పస్కా అనే పొంగని రొట్టెల పండగను ఏడు రోజులు ఆచరించారు.
18 సమూయేలు ప్రవక్త రోజులనుంచి ఇశ్రాయేలులో పస్కాపండగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యాజకులూ, లేవీయులూ, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలువారూ, యెరూషలేము నివాసులతో కలసి యోషీయా పస్కా పండగ ఆచరించినట్టు ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజూ పస్కా పండగ ఆచరించ లేదు. 19 యోషీయా పాలనలో 18 వ సంవత్సరం ఈ పస్కా పండగ జరిగింది.