చెరలోని దుఃఖాలను యిర్మీయా ముందుగా చూడడం (continued)

రాబోయే చెరలోని దుఃఖాలను యిర్మీయా ప్రవక్తగా ముందుగానే వర్ణిస్తాడు.

క్రీ.పూ. 612

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 5–6

1 యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి.

న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.

2 యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.”

3 యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక?

నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు.

రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.

4 నేనిలా అనుకున్నాను “వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు.

5 కాబట్టి నేను ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను.

వారికి యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలిసి ఉంటాయి గదా.”

అయితే వారందరూ కాడిని విరిచేవారే, దేవునితో అంటుకట్టిన కట్లను తెంపుకొన్న వారే.

6 అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది.

అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది.

ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.

7 నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు.

నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?

8 బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు.

9 అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.

10 దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు.

దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు.

11 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నాకు పూర్తిగా ద్రోహం చేశారు. ఇదే యెహోవా వాక్కు.

12 వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు.

13 ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు.

14 కాబట్టి సేనల అధిపతీ, దేవుడూ అయిన యెహోవా చెప్పేదేమంటే,

వారు ఆ విధంగా పలికారు కాబట్టి నా వాక్కు వారిని కాల్చేలా దాన్ని నీ నోట అగ్నిగా ఉంచుతాను. ఈ ప్రజలను కట్టెలుగా చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.

15 ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం.

దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు.

16 వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు.

17 నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు.

నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.

18 అయినా ఆ రోజుల్లో నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యను. ఇదే యెహోవా వాక్కు. 19 “మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు.

20 యాకోబు వంశ ప్రజలకు ఈ మాట చెప్పండి, యూదా వంశ ప్రజలకు ఈ సమాచారం చాటించండి.

21 మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.

22 యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా?

నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను.

దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.

23 ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.

24 వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.

నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.

25 అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలే. మీకు మేలు కలగక పోవడానికి కారణం మీ పాపాలే.

26 నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు.

వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.

27 పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.

28 వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు.

తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.

29 అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.

30 ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి.

31 ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు.

అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?

6:1 “బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి.

ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.

2 సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.

3 కాపరులు తమ గొర్రెల మందలతో దానిలోకి వస్తారు. దాని చుట్టూ గుడారాలు వేస్తారు.

ప్రతివాడూ తన కిష్టమైన చోట మందను మేపుతాడు.

4 యెహోవా పేరున ఆమెతో యుద్ధానికి సిద్ధపడండి. లెండి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం.

అయ్యో, పొద్దుగుంకిపోతున్నది. సాయంకాలపు నీడలు సాగిపోతున్నాయి.

5 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.

6 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘చెట్లు నరికి యెరూషలేమును చుట్టూ ముట్టడించండి.

ఈ పట్టణం నిండా అన్యాయమే జరుగుతున్నది. కాబట్టి దాన్ని శిక్షించడం న్యాయమే.

7 ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది.

దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.

8 యెరూషలేమా, నేను నీ దగ్గర నుండి తొలగి పోకుండేలా, నేను నిన్ను నిర్జనమైన ప్రదేశంగా చేయకుండేలా దిద్దుబాటుకు లోబడు.’

9 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు.

ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’”

10 నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు.

ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.

11 కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను.

వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది.

భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.

12 వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు.

ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు

13 “వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.

14 శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.

15 వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు.

తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు.

కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు.

వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.

16 యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి.

“ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది.

అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.

17 మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.

18 అయితే “మేము వినం” అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి.

19 భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు.

కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.

20 షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు?

మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.

21 కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను.

తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.

22 యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది.

ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.

23 వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది.

సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.

24 వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.

25 బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.

26 నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి.

ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.

27 యిర్మీయా, నిన్ను నా ప్రజలకు మెరుగు పెట్టేవాడిగా, వారిని నీకు లోహపు ముద్దగా నేను నియమించాను.

ఎందుకంటే నువ్వు వారి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవాలి.

28 వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.

29 కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది.

అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.

30 వారిని “పారవేయాల్సిన వెండి” అని పిలవాలి. ఎందుకంటే యెహోవా వారిని పూర్తిగా తోసిపుచ్చాడు.