యెహోషాపాతు యుద్ధాలు, సుపరిపాలన (continued)

క్రీ.పూ. 897

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 20:1–26

1 ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. 2 అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.

3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. 4 యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.

5 యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి, 6 “మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు. 7 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”

8 “వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే 9 నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. 11 మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. 12 మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు. 13 యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

14 అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు, 15 “యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.

16 రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”

18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. 19 కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.

20 వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.

21 అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.

22 వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. 23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.

24 యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. 25 యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది. 26 నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.

కీర్తనలు 115

దావీదు కీర్తన

1 మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నిబంధన విశ్వాస్యత, అధారపడ దగిన నీ గుణాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగు గాక.

2 వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు?

3 మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు

4 వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు.

5 వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు.

6 చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు.

7 చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు.

8 వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.

9 ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం.

10 అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం.

11 యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు.

12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు.

13 పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు.

15 భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు.

16 ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.

17 మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.

18 మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు 46

ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

4 ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.

5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.

6 జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది.

7 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

8 రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.

9 భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.

10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.

11 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.

2 దినవృత్తాంతాలు 20:27–30

27 ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. 28 వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.

29 ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు. 30 ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.

2 దినవృత్తాంతాలు 20:35–37

35 ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు. 36 తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు. 37 అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.

1 రాజులు 22:49

49 అప్పుడు అహాబు కొడుకు అహజ్యా “నా సేవకులను నీ సేవకులతో పాటు ఓడల మీద వెళ్ళనివ్వండి” అని యెహోషాపాతును అడిగాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు.

2 రాజులు 8:16

16 అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన అయిదో సంవత్సరంలో యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదా వాళ్ళపై రాజుగా పరిపాలన ప్రారంభించాడు.