భాగం 4: యెహోషాపాతు పరిపాలన

యూదా రాజ్యం

యెహోషాపాతు సింహాసనారోహణం, సుపరిపాలన

క్రీ.పూ. 914

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 22:41–44

41 ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలెట్టాడు. 42 యెహోషాపాతు పరిపాలించడం మొదలెట్టినప్పుడు అతడు ముప్ఫై అయిదేళ్ళ వాడు. యెరూషలేములో అతడు ఇరవై ఐదేళ్ళు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు. 43 అతడు తన తండ్రి, ఆసా విధానాన్ని అనుసరించి, యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించాడు. అయితే ఉన్నత పూజా స్థలాలను తీసేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.

44 యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు.

1 రాజులు 22:46–47

46 తన తండ్రి ఆసా రోజుల్లోనుంచి మిగిలి ఉన్న మగ వ్యభిచారులను అతడు దేశం నుంచి వెళ్లగొట్టాడు. 47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. ఒక అధికారి పాలించేవాడు.

2 దినవృత్తాంతాలు 17:2–19

2 అతడు యూదా దేశంలోని ప్రాకార పురాలన్నిటిలో సైన్యాలను ఉంచి, యూదా దేశంలో తన తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలి దండులను ఉంచాడు.

3 యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ 4 బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు. 5 కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది. 6 యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.

7 తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు. 8 వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా అనే లేవీయులనూ, ఎలీషామా, యెహోరాము అనే యజకులనూ పంపించాడు. 9 వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని యూదావారి మధ్య ప్రకటిస్తూ, యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు. 10 యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు. 11 ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7, 700 గొర్రె పొట్టేళ్లను, 7, 700 మేకపోతులను సమర్పించేవారు.

12 యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు. 13 యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.

14 వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య.

యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

15 అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2, 80,000 మంది ఉన్నారు.

16 అతని తరువాత జిఖ్రీ కుమారుడు, యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొన్న అమస్యా. అతని దగ్గర 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

17 బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.

18 అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1, 80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

19 రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు.

యెహోషాపాతు యుద్ధాలు, సుపరిపాలన క్రీ.పూ. 897

2 దినవృత్తాంతాలు 18:1–2

1 యెహోషాపాతుకు సంపద, ఘనత, అధికమైన తరవాత అతడు అహాబుతో సంబంధం కలుపుకున్నాడు. 2 కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతడు షోమ్రోనులో ఉండే అహాబు దగ్గరకి వెళ్ళాడు. అహాబు అతని కోసమూ అతని వెంట వచ్చిన మనుషుల కోసమూ అనేకమైన గొర్రెలనూ, పశువులనూ వధించి విందు చేశాడు. తనతో బాటు రామోతు గిలాదు మీదికి వెళ్ళడానికి అతణ్ణి ప్రేరేపించాడు.

2 దినవృత్తాంతాలు 19:1–7

1 యూదారాజు యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. 2 దీర్ఘ దర్శి, హనానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్లి, యెహోషాపాతు రాజుకు ఇలా తెలియచేశాడు. “నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది. 3 అయితే, నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలోనుంచి నువ్వు అషేరా దేవతాస్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనస్సు నిలుపుకున్నావు.”

4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్లి, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాడు. 5 యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరచాడు.

6 అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు. 7 యెహోవా భయం మీమీద ఉండు గాక. తీర్పు తీర్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు.”

కీర్తనలు 82

ఆసాపు కీర్తన

1 దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.

2 ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? సెలా.

3 పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.

4 పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.

5 వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.

6 మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.

7 అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.

8 దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.

2 దినవృత్తాంతాలు 19:8–11

8 యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో యాజకుల్లో ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు. 9 వారికి ఇలా ఆజ్ఞాపించాడు. “యెహోవా మీద భయభక్తులు కలిగి, నమ్మకంతో, యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి.

10 నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.

11 ప్రధానయాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతివారికి అధిపతి, ఇష్మాయేలు కొడుకు జెబద్యా, రాజు సంగతుల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి. మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు.”