యెహోషాపాతు మరణం
క్రీ.పూ. 897
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
31 యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. 32 అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.
33 అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు. 34 యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.
45 యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు చూపించిన బల ప్రభావాలు, యుద్ధం చేసిన పద్ధతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
50 యెహోషాపాతు చనిపోగా తన పూర్వీకుడైన దావీదు పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.
1 ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు.
48 యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరు దేశానికి వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గానీ ఆ ఓడలు బయలుదేర లేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలై పోయాయి.
ఇశ్రాయేలు రాజ్యం క్రీ.పూ. 908
ఏలీయా కరువును ముందుగా తెలియజేయడం
అహాబు పరిపాలన కొనసాగుతుంది. ఏలీయా కరువును ముందుగా తెలియజేస్తాడు, విధవరాలి కుమారుణ్ణి తిరిగి బ్రతికిస్తాడు.
1 గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు. 2 ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు. 3 “నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. 4 ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు.
5 అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. 6 అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు. 7 కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది.
8 యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు. 9 నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.”
10 కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. 11 ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. 12 అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది.
13 అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. 14 భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” 15 అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. 16 యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
17 కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు. 18 ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది.
19 అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. 20 “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు. 21 ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు.
22 యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. 23 ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు. 24 ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.