రెండవ యరొబాము మరణం తరువాత రాజు లేని ఇశ్రాయేలు

క్రీ.పూ. 776

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

హోషేయ 4

1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.

యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

2 అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.

ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

3 కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.

దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు.

సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.

4 ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు.

ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు.

ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే.

5 యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు.

నీ తల్లిని నేను నాశనం చేస్తాను.

6 నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు.

నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను.

ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.

7 యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు.

కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.

8 నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.

9 కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది.

వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను.

వారి క్రియలనుబట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను.

10 వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు.

కాబట్టి వారు భోజనం చేసినా తృప్తి పొందరు.

వ్యభిచారం చేస్తారు గానీ అభివృద్ధి పొందలేరు.

11 లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.

12 నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు.

వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది.

వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు.

13 వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు.

కొండలపై ధూపం వేస్తారు.

సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద,

మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు.

అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.

14 మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను.

మీ కోడళ్ళ వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను.

ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు.

తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చెయ్యడం కోసం బలులర్పిస్తారు.

అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు.

15 ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు.

అయినా యూదా ఆ పాపంలో పాలు పొందక పోవుగాక.

మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు.

యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు.

16 పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలువారు మొండిగా ప్రవర్తించారు.

మైదానంలో మేసే గొర్రె పిల్లలను నడిపించినట్టు దేవుడు వారినెలా నడిపిస్తాడు?

17 ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు.

అతణ్ణి అలానే ఉండనియ్యి.

18 వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా,

వ్యభిచారం మానుకోలేదు.

వారి అధికారులు ఎంతో ఇష్టంగా సిగ్గుమాలిన దాన్ని ప్రేమిస్తారు.

19 సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది.

తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు.

జెకర్యా పరిపాలన క్రీ.పూ. 773

2 రాజులు 15:8–12

8 యూదారాజు అజర్యా పరిపాలనలో 38 వ సంవత్సరంలో యరొబాము కొడుకు జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఆరు నెలలు పరిపాలించాడు. 9 ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ, తన పూర్వికులు చేసినట్టే తానూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

10 యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు. 11 జెకర్యా చేసిన పనులు గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 12 నీ కొడుకులు నాలుగో తరం వరకూ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది.

షల్లూము పరిపాలన క్రీ.పూ. 772

2 రాజులు 15:13–15

13 యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39 వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి, షోమ్రోనులో నెల రోజులు ఏలాడు. 14 గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

15 షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

మెనహేము పరిపాలన

2 రాజులు 15:16–22

16 మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.

17 యూదారాజు అజర్యా పరిపాలనలో 39 వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు. 18 ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

19 అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు. 20 మెనహేము, ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు గనుక అష్షూరురాజు దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.

21 మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 22 మెనహేము తన పూర్వీకులతోబాటు తానూ చనిపోయిన తరువాత అతని కొడుకు పెకహ్యా అతని స్థానంలో రాజయ్యాడు.

పెకహ్యా పరిపాలన క్రీ.పూ. 768

2 రాజులు 15:23–26

23 యూదారాజు అజర్యా పరిపాలనలో 50 వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు. 24 ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

25 ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు. 26 పెకహ్యా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.