భాగం 11: యోతాము పరిపాలన

యూదా రాజ్యం

క్రీ.పూ. 758

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 15:32

32 ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో రెండో సంవత్సరంలో యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు.

2 దినవృత్తాంతాలు 27:1–2

1 యోతాము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా. 2 యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతని కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు.

2 రాజులు 15:35

35 అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు.

మీకా 1–2

1 యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.

2 ప్రజలారా, మీరంతా వినండి.

భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి.

యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.

పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.

3 చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు.

ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు.

4 ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి.

నిప్పుకు కరిగిపోయే మైనంలా,

వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.

5 ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే.

ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం.

యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి?

అది సమరయ కాదా?

యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి?

అది యెరూషలేము కాదా?

6 నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను.

ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను.

దాని రాళ్ళు లోయలో పారబోస్తాను,

దాని పునాదులు కనబడేలా చేస్తాను.

7 దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి.

దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి.

దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను.

అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది,

కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి.

8 ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను.

చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను.

నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.

9 దాని గాయాలు మానవు.

అవి యూదాకు తగిలాయి.

నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి.

10 ఈ సంగతి గాతులో చెప్పవద్దు.

అక్కడ ఏమాత్రం ఏడవద్దు.

బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.

11 షాఫీరు పురవాసులారా,

నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి.

జయనాను పురవాసులారా, బయటకు రావద్దు.

బేత్ ఎజేల్ దుఖిస్తోంది.

వారి భద్రత తొలిగి పోయింది.

12 మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు.

యెహోవా విపత్తు కలిగించాడు.

అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.

13 లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి.

ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి.

నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.

14 మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు.

అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.

15 మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను.

ఇశ్రాయేలీయుల నాయకులు అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు.

16 నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో.

నీ వెంట్రుకలు కత్తిరించుకో.

రాబందులాగా బోడిగా ఉండు.

నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.

2:1 మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ

దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు.

వాళ్లకు అధికారముంది

కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.

2 వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు.

ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు.

వ్యక్తినీ అతని ఇంటినీ,

వ్యక్తినీ అతని వారసత్వాన్నీ వాళ్ళు అణిచేసి ఆక్రమించుకుంటారు.

3 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు,

“ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను.

దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు.

గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది.

4 ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు.

ఎంతో దుఃఖంతో ఏడుస్తారు.

వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం.

యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు.

ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు?

ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.”

5 అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు

భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు.

6 “ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు.

అవమానం రాకూడదు” అని వారంటారు.

7 “యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా?

ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?”

అని చెప్పడం భావ్యమేనా?

యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా!

8 ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు.

యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా,

నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.

9 వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు.

వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు.

10 లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి

మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు.

నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.

11 పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి,

“ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే,

వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు.

12 యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను.

ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను.

గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను.

తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను.

చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.

13 వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు.

వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు.

వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు.

యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.

2 దినవృత్తాంతాలు 27:3–9

3 అతడు యెహోవా మందిర పై ద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలావరకూ కట్టించాడు. 4 అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.

5 అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు. 6 యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యధార్థం ప్రవర్తించాడు కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు 7 యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్దాలన్నిటినీ గురించి, అతని పద్ధతులను గురించి, ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసివున్నాయి. 8 అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. 9 యోతాము కన్ను మూసి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు.

2 రాజులు 15:37

37 ఆ కాలంలో యెహోవా సిరియా రాజు రెజీనునూ, రెమల్యా కొడుకు పెకహునూ యూదా దేశం మీదికి పంపించడం ఆరంభించాడు.

2 రాజులు 15:33–34

33 అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా.

34 ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు.

2 రాజులు 15:36

36 యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

2 రాజులు 15:38

38 యోతాము తన పూర్వీకులతోబాటు చనిపోగా, అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానంలో రాజయ్యాడు.

ఇశ్రాయేలు రాజ్యం

పెకహు పరిపాలన

2 రాజులు 15:27–29

27 యూదా రాజు అజర్యా పరిపాలనలో 52 వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు. 28 ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

29 ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.