రెండవ యరొబాము మరణం
క్రీ.పూ. 784
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
28 యరొబాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని పరాక్రమం గురించి, అతడు చేసిన యుద్ధం గురించి, దమస్కు పట్టణాన్ని, యూదావాళ్లకు ఉన్న హమాతు పట్టణాన్ని ఇశ్రాయేలు కోసం అతడు మళ్ళీ జయించిన సంగతిని గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
10 అప్పుడు బేతేలు యాజకుడు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇలా కబురు పంపాడు “ఇశ్రాయేలీయుల మధ్య, ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. అతని మాటలు దేశం సహించలేదు.” 11 అప్పుడు ఆమోసు,
యరొబాము కత్తితో చస్తాడు.
ఇశ్రాయేలీయులు తప్పకుండా తమ దేశాన్నివిడిచి బందీలుగా వెళతారు అన్నాడు.
12 అమజ్యా ఆమోసుతో ఇట్లన్నాడు. “దీర్ఘదర్శీ, వెళ్ళిపో! యూదా దేశానికి పారిపో. అక్కడే ప్రవచించుకుంటూ పొట్ట పోసుకో. 13 బేతేలులో ఇంక ఎంత మాత్రం ప్రవచించవద్దు. రాజు నివసించే స్థలం, రాజభవనం ఇక్కడ ఉన్నాయి.”
14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇలా అన్నాడు. “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకును కూడా కాదు. నేను గొర్రెల కాపరిని. మేడి చెట్లు చూసుకుంటాను. 15 అయితే, నేను నా మందలను కాస్తూ ఉంటే యెహోవా నన్ను పిలిచి, ‘నువ్వు వెళ్లి నా ప్రజలైన ఇశ్రాయేలు వారికి ప్రవచించు’ అన్నాడు.”
16 అందుచేత యెహోవా మాట వినండి. మీరిలా అంటున్నారు, ఇశ్రాయేలీయులను గురించి ప్రవచించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా మాట జారవద్దు. 17 యెహోవా చెప్పేదేమిటంటే,
నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది.
నీ కొడుకులూ కూతుళ్ళు కత్తితో హతమౌతారు.
శత్రువులు నీ భూమిని కొలిచి పంచుకుంటారు.
నువ్వు అపవిత్ర దేశంలో ప్రాణం విడుస్తావు.
కచ్చితంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి బందీలవుతారు.
8:1 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప! 2 ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో,
నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది.
ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.
3 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
“మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి.
ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి.
నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.
4 దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి. 5 వారిలా అంటారు,
“మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో?
గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో?
మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం.
తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.
6 పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం.
దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”
7 యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
8 దీన్ని బట్టి భూమి కంపించదా?
అందులో నివసించే వారంతా దుఃఖపడరా?
నైలునది లాగా అదంతా పొంగుతుంది.
ఐగుప్తుదేశపు నదిలాగా
అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.
9 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను.
పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది.
10 మీ పండగలను దుఃఖదినాలుగా
మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను.
మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను.
మీ అందరి తలలు బోడిచేస్తాను.
ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను.
దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
11 యెహోవా ప్రకటించేది ఇదే,
“రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను.
అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ
యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.
12 యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ,
ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు
కానీ అది వారికి దొరకదు.
13 ఆ రోజు అందమైన కన్యలూ
యువకులూ దాహంతో సోలిపోతారు.
14 సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు,
‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’
‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు
ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”
9:1 బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు. “గడపలు కదలిపోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు.
పై కప్పు అందరి తలల మీదా పడేలా వాటిని పగలగొట్టు.
తరువాత మిగిలిపోయిన వారిని నేను కత్తితో చంపుతాను.
ఎవడూ పారిపోలేడు. ఎవడూ తప్పించుకోలేడు.
2 చచ్చిన వాళ్ళుండే చోటుకు వాళ్ళు చొచ్చుకు పోయినా
అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగేస్తుంది.
వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోయినా
అక్కడ నుంచి వాళ్ళను దించేస్తాను.
3 కర్మెలు పర్వత శిఖరాన వాళ్ళు దాక్కున్నా
నేను వాళ్ళను వెతికి పట్టుకుంటాను.
నా దృష్టికి కనబడకుండా వాళ్ళు సముద్రపు అడుగున దాక్కున్నా
వాళ్ళను కాటేయడానికి నేను పాముకు ఆజ్ఞాపిస్తాను.
అది వాళ్ళను కాటేస్తుంది.
4 శత్రువులు వాళ్ళను బందీలుగా వేరే దేశాలకు తీసుకుపోయినా
నేనక్కడ కత్తికి పని చెబుతాను. అది వాళ్ళను చంపేస్తుంది.
మేలు చేయడానికి కాక కీడు చేయడానికే నా దృష్టి వారి మీద నిలుపుతాను.
5 ఆయన సేనల అధిపతి యెహోవా.
ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది.
దానిలో జీవించే వారంతా రోదిస్తారు.
నైలునది లాగా అదంతా పొంగుతుంది.
ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి,
మళ్ళీ అణిగి పోతుంది.
6 ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు.
భూమి మీద తన పునాది వేసినవాడు.
సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే.
ఆయన పేరు యెహోవా.
7 ఇశ్రాయేలీయులారా, మీరూ ఇతియోపియా ప్రజలూ నా దృష్టిలో సమానులే గదా!
నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను,
క్రేతు నుంచి ఫిలిష్తీయులను,
కీరు నుంచి అరామీయులనూ రప్పించాను గదా!
8 యెహోవా ప్రభువు కళ్ళు ఈ పాపిష్ఠి రాజ్యాన్ని చూస్తున్నాయి.
దాన్ని భూమి మీద ఉండకుండాా నాశనం చేస్తాను.
అయితే యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.”
యెహోవా వెల్లడించేది ఇదే.
9 “చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను.
ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి
ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు,
ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను.
10 ‘విపత్తు మన దరి చేరదు. మనలను తరమదు’ అని నా ప్రజల్లో అనుకునే
పాపాత్ములంతా కత్తితో చస్తారు.”
11 పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి
దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను.
ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.
12 వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని
నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ
నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను.
ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.
13 “రాబోయే రోజుల్లో పంటకోసేవాడు పొలం దున్నే వాడి వెంటే వస్తాడు.
విత్తనం చల్లుతుండగానే ద్రాక్షపళ్ళు తొక్కేవాళ్ళు వస్తారు.
పర్వతాలు తియ్యటి ద్రాక్షారసం స్రవిస్తాయి.
కొండలన్నీ దాన్ని ప్రవహింప చేస్తాయి.
యెహోవా ప్రకటించేది ఇదే.
14 బందీలుగా దేశాంతరం పోయిన నా ప్రజలలైన ఇశ్రాయేలీయులను నేను తిరిగి తీసుకు వస్తాను.
శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకుని వాళ్ళు వాటిలో నివసిస్తారు.
ద్రాక్షతోటలు నాటి వాటి ద్రాక్షారసాన్ని తాగుతారు.
తోటలు వేసి వాటి పళ్ళు తింటారు.
15 వారి దేశంలో నేను వాళ్ళను నాటుతాను.
నేను వారికిచ్చిన దేశంలోనుంచి వారిని ఇక ఎన్నటికీ పెరికి వేయడం జరగదు.”
మీ యెహోవా దేవుడు చెబుతున్నాడు.
29 యరొబాము తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులతోబాటు చనిపోయిన తరువాత అతని కొడుకు జెకర్యా అతని స్థానంలో రాజయ్యాడు.