జీఫు, మాయోను అరణ్యంలో దావీదు
క్రీ.పూ. 1059
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
13 దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.
14 దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.
15 తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు. 16 అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి “నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు. 17 నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది” అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు. 18 వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.
19 జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి “యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు. 20 రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని” అని చెప్పారు. 21 సౌలు వారితో ఇలా అన్నాడు. “మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక. 22 మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి 23 మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను” అని చెప్పాడు.
ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలమీద పాడేది. జీఫీయులు వచ్చి దావీదు మా దగ్గర దాక్కున్నాడు, అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం.
1 దేవా, నీ నామాన్నిబట్టి నన్ను రక్షించు. నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు.
2 దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
3 గర్వికులు నాకు వ్యతిరేకంగా లేచారు. జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారికి దేవుడంటే లెక్కలేదు.
4 ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
5 నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదకే రప్పిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి.
6 సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
7 ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.
24 వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు, 25 సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.
26 కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. 27 ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి “నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని చెబితే 28 సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టబడింది.