ఏన్గెదీలో దావీదు

క్రీ.పూ. 1058

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 సమూయేలు 23:29–24:22

29 తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.

24:1 సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది. 2 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.

3 దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు. 4 దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.

5 సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని, 6 “ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు. 7 ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.

8 అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి 9 సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? 10 ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’ అని చెప్పాను. 11 నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు. 12 నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.

13 పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను. 14 ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా? 15 యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”

16 దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు “దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?” అని బిగ్గరగా ఏడ్చి 17 దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు 18 ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి. 19 ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.

20 కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు. 21 కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.” అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.

22 తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.

కీర్తనలు 57–58

ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).

1 దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.

2 మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను.

3 ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా.

4 నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు.

5 దేవా, ఆకాశంకంటే అత్యున్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం భూమి అంతటి మీద కనబడనివ్వు.

6 నా అడుగులను పట్టుకోడానికి వారు వల పన్నారు. నా ప్రాణం క్రుంగిపోయింది. వారు నా కోసం ఒక గుంట తవ్వారుగానీ దానిలో వారే పడ్డారు. సెలా.

7 నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.

8 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.

9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.

10 ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.

11 దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.

ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం)

58:1 అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?

2 లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.

3 దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.

4 వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.

5 మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.

6 దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.

7 పారుతున్న నీరులాగా వారు గతించిపోతారు గాక. వారు విడిచిన బాణాలు ముక్కలుగా విరిగిపోతాయి గాక.

8 వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు. నవమాసాలు నిండకుండానే పుట్టే పిండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు.

9 మీ కుండలకు ముళ్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు.

10 వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.

11 కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.

కీర్తనలు 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినది

1 దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.

2 నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.

3 నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

4 నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

5 కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.

6 రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.

7 నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను.

8 నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది.

9 నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు.

10 వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.

11 అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.