కెయీలాలో దావీదు
క్రీ.పూ. 1060
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.
20 అయితే అహీటూబు కొడుకైన అహీమెలెకు కొడుకుల్లో ఒకడైన అబ్యాతారు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి, 21 సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియచేసారు.
22 దావీదు “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉండడంవల్ల వాడు సౌలుకు కచ్చితంగా ఈ సంగతి చెబుతాడని నేననుకొన్నాను. నీ తండ్రి యింటివారందరి మరణానికి నేనే కారకుడనయ్యాను. 23 నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్నూ నిన్నూ చంపాలని చూసేవాడు ఒక్కడే” అని అబ్యాతారుతో చెప్పాడు.
6 దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు.
2 అప్పుడు దావీదు “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా “నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు” అని దావీదుతో చెప్పాడు.
3 దావీదుతో ఉన్నవారు “మేము ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా” అని దావీదుతో అన్నారు. 4 దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. “నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను” అని యెహోవా చెప్పాడు.
5 దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు.
7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని “దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు” అనుకున్నాడు. 8 అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరులనూ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు. 9 సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.
10 అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది. 11 కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి” అని ప్రార్థిస్తే “అతడు వస్తాడు” అని యెహోవా బదులిచ్చాడు.
12 “కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా “వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు” అన్నాడు.
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన.
1 యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు.
2 నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
3 నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు.
4 నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే.
5 నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.
6 నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.
7 నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
8 నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
9 యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
10 నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
11 నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
12 చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
13 చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
14 అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
15 నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
17 యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ.
18 అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
19 నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20 మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
21 ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
22 నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.
23 యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
24 యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.