బయెషాతో ఆసా యుద్ధం

క్రీ.పూ. 955

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 15:16–22

16 ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.

17 ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు. 18 కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు. 19 “మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”

20 కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు. 21 బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు. 22 అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

ఆసా మరణం

2 దినవృత్తాంతాలు 16:7–14

7 ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది. 8 ఇంతకు ముందు లెక్క లేనన్ని రథాలు, గుర్రపు రౌతులు గల ఇతియోపీయులు, లూబీయులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా? అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు. 9 తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.”

10 ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.

11 ఆసా చేసిన పనులన్నిటిని గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది. 12 ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.

13 ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41 వ సంవత్సరంలో చనిపోయాడు. 14 ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ, పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడె మీద అతణ్ణి ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకొన్న సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు.

1 రాజులు 15:23–24

23 ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది. 24 అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు 16:1–6

1 ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు. 2 ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు. 3 “నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో” అని అడిగాడు.

4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు. 5 బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు. 6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.

2 దినవృత్తాంతాలు 15:16–17

16 తన అవ్వ అయిన మయకా అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందుకు ఆమె పట్టపురాణిగా ఉండకుండాా ఆసా రాజు ఆమెను తొలగించి, ఆమె నిలిపిన విగ్రహాన్ని పడగొట్టి, చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. 17 ఆసా ఉన్నత పూజా స్థలాలను ఇశ్రాయేలీయుల్లో నుండి తీసివేయలేదు గానీ అతడు బ్రతికిన కాలమంతా అతని హృదయం యథార్థంగా ఉంది.