ఇశ్రాయేలు రాజ్యం

యరొబాము, అతని కుమారుని మరణాలు

క్రీ.పూ. 955

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 14:1–20

1 అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది. 2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు. 3 కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”

4 యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు. 5 యెహోవా అహీయాతో “యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి” అన్నాడు. 6 గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు.

“యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు. 7 నీవు వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను. 8 దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి, నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు. 9 దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీ కోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు, పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు.

10 కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను. 11 పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది, యెహోవానైన నేనే.’ 12 కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు. 13 అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడిలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది.

14 అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు. 15 ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు. 16 తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.”

17 అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు. 18 యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఖించారు. 19 యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 20 యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు.

నాదాబు పరిపాలన క్రీ.పూ. 953

1 రాజులు 15:25–31

25 యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు. 26 అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.

27 ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు. 28 రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు. 29 తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది. 30 యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.

31 నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

బయెషా పరిపాలన క్రీ.పూ. 930

1 రాజులు 15:32–16:7

32 వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.

33 యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు. 34 ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.

16:1 యెహోవా బయెషాను గురించి హనానీ కొడుకు యెహూతో ఇలా చెప్పాడు, 2 “నేను నిన్ను మట్టిలోనుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు అనే నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేశాను, అయినా సరే, యరొబాము ప్రవర్తించినట్టు నీవు ప్రవర్తిస్తూ ఇశ్రాయేలు వారైన నా ప్రజలు పాపం చేయడానికి కారణమై, వారి పాపాలతో నాకు కోపం పుట్టించావు. 3 కాబట్టి బయెషా వంశాన్నీ అతని కుటుంబీకులనూ నేను పూర్తిగా నాశనం చేసి, నెబాతు కొడుకు యరొబాము వంశానికి చేసినట్టు నీ వంశానికీ చేయబోతున్నాను. 4 పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి. పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి” అన్నాడు.

5 బయెషా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి, అతని బలప్రభావాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 6 బయెషా చనిపోయినప్పుడు తన పూర్వీకులతోపాటు అతన్ని తిర్సాలో సమాధి చేశారు. అతనికి బదులు అతని కొడుకు ఏలా రాజయ్యాడు.

7 యరొబాము వంశం వారిలాగే బయెషా తన పనులతో యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాడు. దానంతటిని బట్టి, యరొబాము కుటుంబాన్నంతా చంపినందుకూ అతనికీ అతని వంశం వారికీ వ్యతిరేకంగా యెహోవా, హనానీ కొడుకు ప్రవక్త అయిన యెహూ ద్వారా తన వాక్కు వినిపించాడు.