భాగం 3: ఆసా పరిపాలన
యూదా రాజ్యం
దేవునిపట్ల ఆసా భక్తి
క్రీ.పూ. 955
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
9 ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు. 10 అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు. 11 ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని
2 ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు. 3 అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు.
12 మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు. 13 తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.
14 ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు. 15 అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు.
4 వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు. 5 ఉన్నత స్థలాలనూ సూర్య దేవతా స్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.
6 ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు.
7 అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు “మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.”
కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు. 8 ఆ కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2, 80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు.
9 ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.
10 వారు మారేషా దగ్గర జెపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు. 11 ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు.
12 అప్పుడు యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటా, యూదా వారి ఎదుటా నిలబడనియ్యకుండా వారిని దెబ్బ తీసిన కారణంగా వారు పారిపోయారు. 13 ఆసా, అతనితో ఉన్నవారూ గెరారు వరకూ వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేతా ఆయన సైన్యం భయం చేతా పారిపోయారు. యూదా వారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు.
14 గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదికీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి, వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు. 15 అక్కడి పశువుల శాలలను పడగొట్టి, విస్తారమైన గొర్రెలనూ ఒంటెలనూ సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు.
ఆసా దేవునితో నిబంధన చేసుకోవడం
1 ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజర్యా మీదికి వచ్చినపుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు. 2 “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. 3 చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి.
4 అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదకారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. 5 ఆ రోజుల్లో అన్ని దేశాల్లో నివాసముండే వారందరూ గొప్ప కలవరంలో ఉండేవారు. కాబట్టి తమ కార్యాలు చక్కబెట్టుకోడానికి అటూ ఇటూ తిరిగే వారికి శాంతి, సమాధానం లేకుండా ఉంది. 6 దేవుడు మనుషులను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు కాబట్టి రాజ్యం రాజ్యానికీ పట్టణం పట్టణానికీ వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలై పోయాయి. 7 అయితే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలమవుతుంది.”
8 ఒదేదు ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు ఆసా విని, ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకున్న పట్టాణాల్లో నుండి అసహ్యమైన విగ్రహాలన్నిటిని తీసివేసి, యెహోవా మంటపం ముందు ఉండే యెహోవా బలిపీఠం మళ్లీ కట్టించాడు. 9 అతడు యూదా, బెన్యామీను వారందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రాల్లో నుండి వారి మధ్య నివసిస్తున్న పరదేశులనూ సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయం చేయడం చూసి ఇశ్రాయేలు వారిలో నుండి చాలా మంది ప్రజలు అతని పక్షం చేరారు.
10 ఆసా పరిపాలనలో 15 వ సంవత్సరం మూడో నెలలో వారు యెరూషలేములో సమావేశమయ్యారు. 11 తాము తీసుకు వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ రోజు 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు. 12 వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేస్తామనీ, 13 పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, అందరిలో ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దగ్గర విచారణ చేయని వారికందరికీ మరణశిక్ష విధిస్తామనీ తీర్మానం చేసుకున్నారు. 14 వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకా నాదంతో, కొమ్ము బూరశబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు.
15 ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదావారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి, పూర్ణమనస్సుతో ఆయనను వెతకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు.
18 అతడు తన తండ్రి, తాను ప్రతిష్ఠించిన వెండి, బంగారు ఉపకరణాలను తీసుకు వచ్చి దేవుని మందిరంలో ఉంచాడు. 19 ఆసా పాలనలో 35 వ సంవత్సరం వరకూ ఎలాటి యుద్ధాలు జరగలేదు.