జనాలకు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఆమోసు ప్రవచనం

పొరుగు జనాలపైనా, ఇశ్రాయేలుపైనా, యూదాపైనా తీర్పును ఆమోసు ప్రకటిస్తాడు.

క్రీ.పూ. 793

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆమోసు 1–4

1 ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు. 2 అతడు ఇలా చెప్పాడు,

“యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు.

యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు.

కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి.

కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”

3 యెహోవా చెప్పేదేమిటంటే,

“దమస్కు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి,

నేను తప్పకుండాా దాన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే వాళ్ళు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.

4 నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.

5 దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను.

బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను.

బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను.

ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.”

అని యెహోవా చెబుతున్నాడు.

6 యెహోవా చెప్పేదేమిటంటే,

“గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి,

నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు.

7 గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను.

అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది.

8 అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను.

అష్కెలోనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను.

ఎక్రోనుకు విరోధంగా నా చెయ్యి ఎత్తుతాను.

ఇంకా మిగిలిన ఫిలిష్తీయులు నాశనమవుతారు” అని యెహోవా ప్రభువు చెబుతున్నాడు.

9 యెహోవా చెప్పేదేమిటంటే,

“తూరు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే వాళ్ళు ప్రజా సమూహాలన్నిటినీ ఎదోముకు అప్పగించారు.

వాళ్ళు సోదర భావంతో చేసుకున్న నిబంధనను తెగతెంపులు చేసుకున్నారు.

10 నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను.

అది దాని రాజ భవనాలను దహించి వేస్తుంది.”

11 యెహోవా చెప్పేదేమిటంటే,

“ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి,

నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు.

అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది.

అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది.

12 తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.”

13 యెహోవా చెప్పేదేమిటంటే,

“అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను.

ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు.

14 రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను.

యుద్ధ ధ్వనులతో, సుడి గాలి వీచేటప్పుడు కలిగే ప్రళయం లాగా అది రాజ భవనాలను దహించివేస్తుంది.

15 వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.

2:1 యెహోవా చెప్పేదేమిటంటే

“మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు

చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను

కాల్చి సున్నం చేశారు.

2 మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను.

అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది.

యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే

మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.

3 దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను.

అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.

4 యెహోవా చెప్పేదేమిటంటే

“యూదా మూడు సార్లు,

నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి

నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను.

ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి

యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి,

ఆయన విధులను గైకొనలేదు.

5 యూదా మీద నేను అగ్ని పంపిస్తాను.

అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”

6 యెహోవా తెలియజేసేది ఏంటంటే

“ఇశ్రాయేలు మూడు సార్లు

నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి

నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.

ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు.

చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.

7 నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు

దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు.

అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు.

తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని

నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.

8 తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా

ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు.

జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని

తమ దేవుని మందిరంలో తాగుతారు.

9 దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ

సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను

వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా!

పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ

నేను నాశనం చేశాను గదా!

10 ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి,

అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని

నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.

11 మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను.

మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను.

ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?”

యెహోవా వెల్లడించేది ఇదే.

12 “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు.

ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.

13 చూడండి. ధాన్యంతో నిండిన బండి

ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు

నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.

14 చురుకైన వారు సైతం తప్పించుకోలేరు.

బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు.

గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.

15 విలుకాడు నిలబడలేడు.

వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు.

రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.

16 ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా

నగ్నంగా పారిపోతారు.

యెహోవా ప్రకటించేది ఇదే.”

3:1 ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.

2 లోకంలోని వంశాలన్నిటిలో

మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను.

కాబట్టి మీ పాపాలన్నిటికీ

మిమ్మల్ని శిక్షిస్తాను.

3 సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా?

ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?

4 దేన్నీ పట్టుకోకుండానే

కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?

5 నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా?

ఉరిలో ఏదీ చిక్కకపోతే

ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?

6 పట్టణంలో బాకానాదం వినబడితే

ప్రజలు భయపడరా?

యెహోవా పంపకుండా

పట్టణంలో విపత్తు వస్తుందా?

7 తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.

8 సింహం గర్జించింది.

భయపడని వాడెవడు?

యెహోవా ప్రభువు చెప్పాడు.

ప్రవచించని వాడెవడు?

9 అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి.

ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి.

వాళ్ళతో ఇలా చెప్పండి,

“మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై

దానిలోని గందరగోళాన్ని చూడండి.

అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.

10 సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.”

యెహోవా ప్రకటించేది ఇదే.

వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం,

నాశనం దాచుకున్నారు.

11 కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,

శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు.

అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు.

నీ రాజ భవనాలను దోచుకుంటాడు.

12 యెహోవా చెప్పేదేమిటంటే,

“సింహం నోట్లో నుంచి

కేవలం రెండు కాళ్ళు గానీ

చెవి ముక్క గానీ

కాపరి విడిపించేలాగా

సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను.

కేవలం మంచం మూల,

లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”

13 యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి.

యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,

14 “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు,

బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను.

బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.

15 చలికాలపు భవనాలనూ

వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను.

ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి.

పెద్ద భవనాలు అంతరించిపోతాయి.”

యెహోవా ప్రకటించేది ఇదే.

4:1 సమరయ పర్వతం మీద ఉన్న

బాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూ

దిక్కులేని వాళ్ళని బాధిస్తూ,

మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా”

అనే మీరు, ఈ మాట వినండి.

2 యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే,

“మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది.

మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు.

3 మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు.

మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.”

యెహోవా ప్రకటించేది ఇదే.

4 బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి.

గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి.

ప్రతి ఉదయం బలులు తీసుకు రండి.

మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి.

5 రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి.

స్వేచ్ఛార్పణలు ప్రకటించండి.

వాటి గురించి చాటించండి.

ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా.

యెహోవా ప్రకటించేది ఇదే.

6 మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను.

మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను.

అయినా మీరు నా వైపు తిరుగలేదు.

యెహోవా ప్రకటించేది ఇదే.

7 కోతకాలానికి మూడు నెలలు ముందే

వానలేకుండా చేశాను.

ఒక పట్టణం మీద వాన కురిపించి

మరొక పట్టణం మీద కురిపించలేదు.

ఒక చోట వాన పడింది,

వాన పడని పొలం ఎండిపోయింది.

8 రెండు మూడు ఊర్లు

మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే

అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు.

అయినా మీరు నా వైపు తిరగలేదు.

యెహోవా ప్రకటించేది ఇదే.

9 విస్తారమైన మీ తోటలన్నిటినీ

తెగుళ్ళతో నేను పాడు చేశాను.

మీ ద్రాక్షతోటలనూ

అంజూరపు చెట్లనీ

ఒలీవచెట్లనూ

మిడతలు తినేశాయి.

అయినా మీరు నావైపు తిరగలేదు.

యెహోవా ప్రకటించేది ఇదే.

10 నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు

మీ మీదికి తెగుళ్లు పంపాను.

మీ యువకులను కత్తితో చంపేశాను.

మీ గుర్రాలను తీసుకుపోయారు.

మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన

మీ ముక్కుల్లోకి ఎక్కింది.

అయినా మీరు నా వైపు తిరగలేదు.

యెహోవా ప్రకటించేది ఇదే.

11 దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు

నేను మీలో కొంతమందిని నాశనం చేశాను.

మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు.

అయినా మీరు నా వైపు తిరగలేదు.

యెహోవా ప్రకటించేది ఇదే.

12 కాబట్టి ఇశ్రాయేలీయులారా,

మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను.

కాబట్టి ఇశ్రాయేలీయులారా,

మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి.

13 పర్వతాలను రూపించే వాడూ

గాలిని పుట్టించేవాడూ ఆయనే.

ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు.

ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు.

భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు.

ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.