జనాలకు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఆమోసు ప్రవచనం (continued)
పొరుగు జనాలపైనా, ఇశ్రాయేలుపైనా, యూదాపైనా తీర్పును ఆమోసు ప్రకటిస్తాడు.
క్రీ.పూ. 793
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.
2 ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.
ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు.
లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
3 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
“ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.
వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”
4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు,
“నన్ను వెతికి జీవించండి.
5 బేతేలును ఆశ్రయించవద్దు.
గిల్గాలులో అడుగు పెట్టవద్దు.
బెయేర్షెబాకు పోవద్దు.
గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు.
బేతేలుకు ఇక దుఖమే.”
6 యెహోవాను ఆశ్రయించి జీవించండి.
లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు.
అది దహించి వేస్తుంది.
బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.
7 వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి,
నీతిని నేలపాలు చేస్తున్నారు.
8 ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు.
చీకటిని తెలవారేలా చేసేవాడు.
పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు.
సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి
భూమి మీద కుమ్మరిస్తాడు.
9 ఆయన పేరు యెహోవా.
బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా
నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.
10 పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని
వాళ్ళు అసహ్యించుకుంటారు.
యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.
11 మీరు పేదలను అణగదొక్కుతూ
ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు,
కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా
వాటిలో నివసించరు.
మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా
ఆ ద్రాక్ష మద్యం తాగరు.
12 మీ నేరాలెన్నో నాకు తెలుసు.
మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు.
మీరు లంచాలు తీసుకుని
తప్పుచేయని వారిని బాధిస్తారు.
ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
13 అది గడ్డుకాలం గనక
ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.
14 మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి.
అలా చేస్తే మీరనుకున్నట్టు
యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
తప్పకుండా మీతో ఉంటాడు.
15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి.
పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి.
ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
16 అందుచేత యెహోవా ప్రభువు,
సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే,
“ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది.
ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు.
ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు.
దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు.
17 ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది.
ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.”
18 యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు
ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు?
అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.
19 ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే
ఎలుగుబంటి ఎదురు పడినట్టు,
లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే
పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
20 యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా?
కాంతితో కాక చీకటిగా ఉండదా?
21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.
మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా
నేను వాటిని అంగీకరించను.
సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.
మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.
నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
25 ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు
మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా?
26 మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు.
సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.
27 కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి
మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను,
అని యెహోవా చెబుతున్నాడు.
ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.
6:1 సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు.
సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు.
ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.
2 మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి.
అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి.
ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి.
అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా?
వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
3 విపత్తు రోజు దూరంగా ఉందనుకుని
దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.
4 వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని,
పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు.
మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
5 తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ
దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
6 ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు.
పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ
యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
7 కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు.
సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు.
8 “యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం.
వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం.
కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను.
నేను, ప్రభువైన యెహోవాను.
నా తోడని ప్రమాణం చేశాను.”
సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.
9 ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు. 10 వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.
11 ఎందుకంటే గొప్ప కుటుంబాలు,
చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని
మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
12 గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా?
అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా?
అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
13 లొదెబారు పట్ల ఆనందించే మీరు,
“మా సొంత బలంతో కర్నాయింను వశం చేసుకోలేదా?” అంటారు.
14 అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే,
“ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను.
వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ
మిమ్మల్ని బాధిస్తారు.”
7:1 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. రాజుకు రావలసిన కోత తరువాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు ఆయన మిడతల గుంపు పుట్టించాడు. 2 అవి పచ్చికనంతా తినేసినప్పుడు నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, దయచేసి క్షమించు. యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది” 3 దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది జరగదు” అన్నాడు.
4 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. శిక్షించడానికి యెహోవా ప్రభువు అగ్ని రప్పించాడు. అది భూమి కిందున్న అగాధ మహా జలాన్ని ఎండగొట్టి భూమిని కూడా మింగేసేదే. 5 అయితే నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది?” 6 దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది కూడా జరగదు” అన్నాడు.
7 ఆయన నాకిది చూపించాడు. చూడు, మట్టపు గుండు చేతిలో పట్టుకుని ప్రభువు గోడ పక్కన నిలబడ్డాడు. 8 యెహోవా నాతో ఇలా అన్నాడు. “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” “మట్టపు గుండు” అన్నాను. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు. “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను. ఇక ఏమాత్రం నేను వాళ్ళను వదిలిపెట్టను.
9 ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి.
ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి.
యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.”