ఇశ్రాయేలు రాజ్యం

రెండవ యరొబాము పరిపాలన ముగింపు

క్రీ.పూ. 809

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 14:25–27

25 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడు యోనా అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాట చొప్పున ఇతడు హమాతుకు వెళ్ళే దారి మొదలుకుని అరాబా సముద్రం వరకూ ఇశ్రాయేలువాళ్ళ సరిహద్దును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు.

26 దాసులుగాని, స్వతంత్రులుగాని, ఇశ్రాయేలు వాళ్లకు సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరు. 27 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారు పడిన బాధ ఎంతో ఘోరమైనదిగా ఎంచాడు. ఇశ్రాయేలు అనే పేరు ఆకాశం కింద నుంచి తుడిచి వేయనని యెహోవా చెప్పాడు గనుక యెహోయాషు కొడుకు యరొబాము ద్వారా వాళ్ళను రక్షించాడు.

ఇశ్రాయేలుకు హోషేయ ప్రవచనం క్రీ.పూ. 801

పది గోత్రాలకు హోషేయ మొదటి విజ్ఞప్తి.

హోషేయ 1–3

1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

2 యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు.

“వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో.

ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు.

ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.”

3 కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు.

ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది.

4 యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు.

“వీడికి ‘యెజ్రెయేల్’ అని పేరు పెట్టు.

యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు.

దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను.

ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను.

5 ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే,

నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను.”

6 గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది.

యెహోవా అతనికి ఇలా చెప్పాడు.

“దీనికి ‘లో రూహామా’ అని పేరు పెట్టు.

ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను.

7 అయితే యూదావారిపై జాలి చూపుతాను.

వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.

విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.”

8 లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది.

9 యెహోవా ఇలా చెప్పాడు.

“వీడికి ‘లో అమ్మీ’ అని పేరు పెట్టు.

ఎందుకంటే మీరు నా ప్రజలు కారు,

నేను మీకు దేవుణ్ణి కాను.

10 అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది.

దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము.

ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో,

అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు.

11 యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు.

తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు.

ఆ దేశంలో నుండి బయలు దేరుతారు.

ఆ యెజ్రెయేలు దినం మహా ప్రభావ దినం.”

2:1 మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి.

మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి.

2 మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు.

వ్యాజ్యం వెయ్యి.

ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను.

ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి.

తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి.

3 లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను.

ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను.

ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను.

దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను.

4 ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.

5 వారి తల్లి కులట.

వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది.

ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.

6 కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను.

దానికి దారి కనబడకుండా గోడ కడతాను.

7 అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది.

ఎంత వెతికినా వారు దానికి కనబడరు.

అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.”

8 దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు.

వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.

9 కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను.

ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను.

10 దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను.

నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.

11 ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను.

ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను.

12 “ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.

13 అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను.

ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు.

నగలు పెట్టుకుని, సింగారించుకుని.

నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను.

ఇది యెహోవా వాక్కు.

14 ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను.

అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను.

15 ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను.

ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను.

యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది.

16 “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు.

‘నా భర్త’ అంటావు.”

17 ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.

18 “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో,

పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను.

దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను.

వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.

19 నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

20 యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.

21 ఆ దినాన నేను జవాబిస్తాను.”

ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి.

22 భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా,

అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి.

23 నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను.

లో రుహమా పై నేను జాలి పడతాను.

నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా,

వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.

3:1 యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఎండు ద్రాక్షముద్దలను ఆశించి ఇతర దేవుళ్ళను పూజించినా నేను, యెహోవాను, వారిని ప్రేమించినట్టే తన భర్త ప్రేమను చూరగొనిన వ్యభిచారిణి దగ్గరికి పోయి ఆమెను ప్రేమించు.”

2 కాబట్టి నేను పదిహేను తులాల వెండి, 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను. 3 ఆమెతో ఇలా అన్నాను. “సుదీర్ఘకాలం నీవు నాతో ఉండిపో. వేశ్యగానైనా, ఏ మగవాడికి చెందిన దానిగానైనా ఉండవద్దు. నేను కూడా నీపట్ల అలానే ఉంటాను.”

4 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు.

5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.