యెరూషలేం గోడల పునర్నిర్మాణం (continued)

క్రీ.పూ. 445

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నెహెమ్యా 6

1 నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది. 2 సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. “ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి” అని మాకు కబురు పంపారు. 3 అప్పుడు నేను “నేను చేస్తున్న పని మహత్తరమైనది. ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని నా మనుషులతో జవాబు పంపాను. 4 వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను.

5 ఐదవసారి సన్బల్లటు తన పనివాడి ద్వారా ఒక బహిరంగ లేఖ నాకు పంపించాడు. 6 ఆ ఉత్తరంలో “యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు, యూదులు కలసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. 7 ‘యూదులకు రాజు ఉన్నాడు’ అని నిన్ను గూర్చి ప్రకటించడానికి యెరూషలేంలో కొందరు ప్రవక్తలను నువ్వు నియమించావని, ఇంకా ఇతర విషయాలు రాజుకు తెలిశాయన్న పుకార్లు బయలుదేరాయి. అన్య జాతుల ప్రజల మధ్య ఈ పుకార్లు గెషెం లేవదీస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించడానికి మనం కలుసుకుందాం” అని రాసి ఉంది. 8 ఇలా చేస్తే మేము బెదిరిపోయి పని చేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు. 9 “మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు” అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి.

10 తరువాత మెహేతబేలు మనవడు దెలాయ్యా కొడుకు షెమయా యింటికి వచ్చాను. అతణ్ణి అతడి ఇంట్లోనే నిర్బంధించారు. అతడు “రాత్రివేళ నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారు, మనం దేవుని మందిరం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుందాం రా” అని నాతో అన్నాడు. 11 నేను “నాలాంటి వాడు పారిపోవచ్చా? ఇంతటి వాడినైన నేను నా ప్రాణం కాపాడుకోవడానికి ఆలయం లోపలి భాగంలోకి వెళ్ళవచ్చా? నేను ఆలయంలోకి రాను” అన్నాను. 12 అప్పుడు షెమయా ద్వారా దేవుడు ఈ మాట చెప్పించలేదనీ, టోబీయా, సన్బల్లటులు అతనికి డబ్బిచ్చి నా గురించి ఇలా చెప్పించారనీ స్పష్టంగా తెలుసుకున్నాను.

13 నన్ను భయపెట్టడానికి వారు అలా చేశారు. అతడు చెప్పినట్టు చేసి నేను పాపంలో పడిపోతానని వాళ్ళు భావించారు. నేనలా చేస్తే నా పేరు పాడు చేసి, నన్ను అవమాన పరచవచ్చు అని వారి ఉద్దేశం. నాకు వ్యతిరేకంగా వారు చేసిన పనులన్నీ గుర్తుంచుకో. 14 నా దేవా, టోబీయా, సన్బల్లటులను గుర్తుంచుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్న నోవద్యా అనే స్త్రీ ప్రవక్తను, తక్కిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకో.

15 ఈ విధంగా ఏలూలు నెల 25 వ తేదీన, అంటే 52 రోజులకు సరిహద్దు గోడలు కట్టడం పూర్తి అయింది. 16 అయితే మా శత్రువులూ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలూ జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు. 17 ఆ రోజుల్లో యూదుల ప్రముఖులు టోబీయాకు మాటిమాటికీ ఉత్తరాలు రాశారు. అతడు కూడా వాళ్ళకు జవాబులు రాస్తున్నాడు. 18 అతడు ఆరహు కొడుకు, షెకన్యాకు అల్లుడు. అదీకాక, అతని కొడుకు యోహానాను బెరెక్యా కొడుకు మెషుల్లాము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి యూదుల్లో చాలామంది అతని పక్షంగా ఉంటామని ప్రమాణం చేశారు. 19 వాళ్ళు నా సమక్షంలో అతడి మంచి లక్షణాల గురించి చెబుతూ వచ్చారు. నేను చెప్పిన మాటలు కూడా అతనికి తెలియజేశారు. నన్ను భయపెట్టడానికే టోబీయా ఉత్తరాలు పంపాడు.

యెరూషలేం గోడ ప్రతిష్ఠ

నెహెమ్యా 12:27–43

27 యెరూషలేం సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేంకు రప్పించే పని చేపట్టారు. 28 అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేం చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల్లో నుండి సమకూడి వచ్చారు. 29 యెరూషలేం చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబం నుండి, గెబ, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు. 30 యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు.

31 తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదికి ఎక్కించాను. స్తుతి గీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్త ద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు. 32 వారితోపాటు హోషయా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్ళారు. 33 ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, 34 యూదా, బెన్యామీను, షెమయాయు, యిర్మీయా అనేవాళ్ళు కూడా గోడ ఎక్కారు. 35 షెమయా మనవడు, యోనాతాను కొడుకు జెకర్యాతో కలసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్ళారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మీకాయా, మీకాయా కొడుకు మత్తన్యా. మత్తన్యా కొడుకు షెమయా.

36 షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవ సేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్ళారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు. 37 వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊట ద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణం దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్ళారు.

38 కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను. 39 ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు. 40 ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞతా గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేనూ నాతోపాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం.

41 యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు. 42 ఇజ్రహయా అనే వాడి ఆధ్వరంలో గాయకులు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు పెద్ద స్వరంతో పాటలు పాడారు. 43 వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.

నెహెమ్యా పర్షియాకు తిరిగి వెళ్లడం

నెహెమ్యా 7:1–4

1 నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను. 2 తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి. 3 అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.

4 ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు.