యెరూషలేం గోడల పునర్నిర్మాణం (continued)

క్రీ.పూ. 445

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నెహెమ్యా 4–5

1 మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు. 2 షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?” 3 అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.

4 “మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి. 5 వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”

6 అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది. 7 యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు. 8 జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు. 9 మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము.

10 అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు. 11 మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు. 12 మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు. 13 అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను.

14 నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను. 15 వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం. 16 అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు.

17 గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు. 18 కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు. 19 అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం. 20 కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”

21 ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు. 22 ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను. 23 ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.

5:1 తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2 కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు. 3 మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు.

4 మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం. 5 మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు. 6 ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది.

7 అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను. 8 “ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా?” అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు.

9 నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా? 10 నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం. 11 ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.”

12 అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను. 13 నేను నా దుప్పటి దులిపి “ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వ్యక్తినీ అతని ఇంట్లో, ఆస్తిలో పాలు లేకుండా దేవుడు దులిపి వేస్తాడు గాక. ఆ విధంగా అలాంటివాడు దులిపి వేసినట్టుగా అన్నీ పోగొట్టుకుంటాడు” అని చెప్పాను. సమాజమంతా “అలాగే జరుగుతుంది గాక” అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా ఈ వాగ్దానం ప్రకారం చేశారు.

14 నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటినుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20 వ సంవత్సరం నుండి 32 వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేను గానీ, నా బంధువులు గానీ తీసుకోలేదు. 15 అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి చొప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై ఆధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చేయలేదు. 16 నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు. 17 నా భోజనం బల్ల దగ్గర మా చుట్టూ ఉన్న అన్యదేశాల నుండి వచ్చిన ప్రజలతోపాటు యూదులు, అధికారులు మొత్తం 150 మంది మాతో కలసి భోజనం చేసేవాళ్ళు. 18 నా కోసం ప్రతి రోజూ ఒక ఎద్దు, ఆరు శ్రేష్ఠమైన గొర్రెలు భోజనం కోసం సిద్ధం చేసేవారు. ఇవి కాకుండా పిట్టలు, పది రోజులకొకసారి రకరకాల ద్రాక్షారసాలు సమృద్ధిగా సిద్ధపరిచే వారు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎంతో కఠినమైన బానిసత్వం కింద ఉన్నందువల్ల అధికారిగా నాకు రావలసిన రాబడి నేను ఆశించలేదు. 19 నా దేవా, నేను ఈ ప్రజల కోసం చేసిన అన్ని రకాల ఉపకారాలనుబట్టి నన్ను జ్ఞాపకముంచుకుని కరుణించు.