విశ్రాంతి దినాన ధాన్యపు కంకులు తెంపిన శిష్యులు
శిష్యులు పొలాల్లో ధాన్యపు కంకులు తెంపినప్పుడు, విశ్రాంతి దినం గురించి పరిసయ్యులతో మరో వివాదం.
చాలా మటుకు యెరూషలేము నుండి తిరిగి వస్తుండగా దారిలో, గలిలయలో
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 12:1–8
12:1 ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
2 పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
3 ఆయన వారితో, “దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా?
4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.
5 విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? 6 దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను.
7 ‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.
8 కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అన్నాడు.
మార్కు రాసిన సువార్త 2:23–28
2:23 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు.
24 పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు.
25 అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా?
26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.
27 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు.
28 అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అని వారితో చెప్పాడు.
లూకా రాసిన సువార్త 6:1–5
6:1 ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు.
2 అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, “విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు” అని వారినడిగారు.
3 యేసు వారితో ఇలా అన్నాడు, “దావీదుకీ, అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేశాడో అది కూడా మీరు చదవలేదా?
4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని, తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా!” అన్నాడు.
5 ఇంకా ప్రభువు, “అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని” అని వారితో చెప్పాడు.
విశ్రాంతి దినాన ఎండిపోయిన చెయ్యిని స్వస్థపరిచిన యేసు
ఒక సమాజ మందిరంలో చెయ్యి ఎండిపోయిన వ్యక్తిని స్వస్థపరచడం గురించి పరిసయ్యులతో విశ్రాంతి దినానికి సంబంధించిన మూడవ వివాదం.
గలిలయలో
మత్తయి రాసిన సువార్త 12:9–14
12:9 ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు. 10 పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, “విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?” అని ఆయనను అడిగారు.
11 అందుకాయన, “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా?
12 గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే” అని చెప్పి 13 ఆ మనిషితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది.
14 పరిసయ్యులు బయటికి పోయి, ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు.
మార్కు రాసిన సువార్త 3:1–6
3:1 యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు.
2 అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
3 యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు” అన్నాడు. 4 అప్పుడు ఆయన వారితో, “విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?” అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
5 వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, “నీ చెయ్యి చాపు” అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
6 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు.
లూకా రాసిన సువార్త 6:6–11
6:6 మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు.
7 ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
8 వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, “నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు.
9 అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను” అని వారితో చెప్పి 10 చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి, “నీ చెయ్యి చాపు” అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
11 అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు.