సముద్ర తీరాన గొప్ప జనసమూహాలకు బోధించి స్వస్థపరిచిన యేసు

యేసు గలిలయ సముద్ర తీరాన గొప్ప జనసమూహాలకు బోధించి, వారిని స్వస్థపరుస్తాడు.

క్రీస్తు పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకుని, వారికీ జనసమూహాలకూ కొండమీది ప్రసంగం చేయడం ఇక్కడ మనం చూస్తాం.

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 12:15–21

12:15-16 యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.

17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

18 “ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను.

ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను.

ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.

19 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు.

20 న్యాయాన్ని గెలిపించే వరకూ,

ఈయన నలిగిన రెల్లును విరవడు.

ఆరిపోతున్న వత్తిని నలపడు.

21 ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం.

మార్కు రాసిన సువార్త 3:7–12

3:7 యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు. 9 ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు.

10 ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. 11 దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు.

12 యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.

పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకున్న యేసు

ఒక రాత్రంతా ప్రార్థించిన తరువాత యేసు పన్నెండుమంది అపొస్తలులను ఎన్నుకుంటాడు.

మార్కు రాసిన సువార్త 3:13–19

3:13 తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు.

14 తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. 15 రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.

16 వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు), 17 జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం), 18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,

19 యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.

లూకా రాసిన సువార్త 6:12–16

6:12 ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.

13 ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు.

14 వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను,

16 యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.