తూరు నాశనం (continued)
క్రీ.పూ. 587
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2 నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 3 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!
4 నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు. 5 నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.
6 కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 7 నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు. 8 వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు. 9 నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు. 10 నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
11 యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. 12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి. 13 దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.
14 అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి. 15 నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.
16 అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను. 17 నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.
18 నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను. 19 ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.”
20 యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 21 “నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు. 22 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోను, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.
23 నేను ఘోరమైన అంటురోగాన్ని మీ మధ్య పంపిస్తాను. మీ వీధుల్లో రక్తపాతం జరుగుతుంది. అన్ని వైపుల నుంచి నీ మీద కత్తి దూస్తారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 24 ఇశ్రాయేలీయుల చుట్టూ గుచ్చుకునే ముళ్ళ కంపల్లాగా నొప్పి కలిగించే గచ్చతీగల్లాగా వారిని తృణీకరించిన ప్రజలు ఇంక ఎవరూ ఉండరు. అప్పుడు నేనే యెహోవా ప్రభువునని వాళ్ళు తెలుసుకుంటారు.”
25 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను దగ్గర చేర్చి, ప్రజల ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను. అప్పుడు నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ దేశంలో వాళ్ళు నివసిస్తారు. 26 వాళ్ళు అందులో భయం లేకుండా నివసించి ఇళ్ళు కట్టుకుని ద్రాక్షతోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వాళ్ళను తృణీకరించే వారందరికీ నేను శిక్ష విధించిన తరువాత వాళ్ళు భయం లేకుండా నివసించేటప్పుడు నేను తమ యెహోవా దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు.”
ఫరో కోసం యెహెజ్కేలు విలాపం
ఐగుప్తుకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం.
1 బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 2 నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు.
“రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి.
నదిలో మొసలివంటి వాడివి.
నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”
3 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే,
“నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.
4 నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను.
గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.
5 నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.
6 నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను.
వాగులు రక్తంతో నిండుతాయి.
7 నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను.
సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.
8 నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను.
నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
9 “నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను. 10 నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”
11 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!
12 శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు.
వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.
13 సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను.
ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.
14 అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.”
ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15 “నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి
దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే
నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
16 ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు.
వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు.
ఇదే యెహోవా ప్రభువు సందేశం.