యెహెజ్కేలు: ఐగుప్తు గోతిలోకి దిగిపోతుంది
ఐగుప్తుకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం.
క్రీ.పూ. 587
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
17 పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.
18 నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు.
భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.
19 వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’
20 కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.
21 పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు,
‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’
22 అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి.
వాళ్ళంతా కత్తితో చచ్చారు.
23 దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి.
దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి.
వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.
24 ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.
వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు.
వాళ్ళు సిగ్గు పాలవుతారు.
25 చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి.
వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు.
వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.
26 అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి.
దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.
27 వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు.
వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు.
తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు.
28 కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.
29 అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.
30 అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.
31 కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. 32 “సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
బబులోనులోని చెరలో ఉన్నవారికి విజ్ఞప్తి
1 యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 2 “నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో. 3 అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో. 4 అప్పుడు ఎవడైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్తపడక పోతే, కత్తి వచ్చి వాడి ప్రాణం తీసేస్తే వాడు తన చావుకు తానే బాధ్యుడు.
5 బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే.
6 అయితే కావలివాడు కత్తి రావడం చూసినా కూడా, బూర ఊదకుండా ప్రజలను హెచ్చరించకుండా ఉన్నాడనుకో. కత్తి వచ్చి వాళ్ళలో ఒకడి ప్రాణం తీస్తే, వాడు తన దోషాన్ని బట్టి చస్తాడు. కానీ, అతని చావుకు నేను కావలి వాడినే బాధ్యుని చేస్తాను.
7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి. 8 ‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను. 9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు.
10 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలియచెయ్యి. ‘మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటి వలన మేము నీరసించిపోతున్నాము. మేమెలా బతుకుతాం?’ అని మీరంటున్నారు. 11 వారితో ఇలా చెప్పు, నా జీవం మీద ఆనబెట్టి చెబుతున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం లేదు. దుర్మార్గుడు తన పద్ధతిని బట్టి పశ్చాత్తాపపడి బతకాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు మార్చుకోండి. మీ దుర్మార్గతనుంచి పశ్చాత్తాప పడండి. మీరెందుకు చావాలి? ఇదే యెహోవా ప్రభువు సందేశం.
12 నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ మాట చెప్పు. నీతిమంతుడు పాపం చేస్తే అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు! దుష్టుడు చెడుతనం విడిచి మనస్సు మార్చుకుంటే తాను చేసిన దుర్మార్గాన్ని బట్టి వాడు నాశనం కాడు. అలాగే నీతిమంతుడు పాపం చేస్తే తన నీతిని బట్టి అతడు బతకడు. 13 నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
14 ‘తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గునికి నేను చెప్పిన తరువాత అతడు తన పాపం విడిచి, నీతి న్యాయాలను అనుసరిస్తూ 15 తన దగ్గర అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, తాను దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చి వేసి పాపం చేయకుండా, జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బతుకుతాడు. 16 అతడు చేసిన పాపాల్లో ఏదీ అతని విషయం జ్ఞాపకానికి రాదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతడు బతుకుతాడు.
17 అయినా నీ ప్రజలు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. అయితే వారి పద్ధతే అన్యాయమైనది. 18 నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు. 19 దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతిన్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు బతుకుతాడు. 20 అయితే మీరు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడి ప్రవర్తననుబట్టి వాడికి శిక్ష విధిస్తాను.”