ఇశ్రాయేలు రాజ్యం
యెహూ మరణం
క్రీ.పూ. 838
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
30 కాబట్టి యెహోవా యెహూతో “అహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయంలో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు” అని చెప్పాడు. 31 అయితే యెహూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం పూర్ణ హృదయంతో జీవించడంలో ఎలాటి శ్రద్ధా చూపించలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన యరోబాము చేసిన పాపాలను వదిలి పెట్టలేదు.
32 ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యొర్దాను నదికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఓడించాడు. 33 గిలాదు ప్రాంతం, అర్నోను లోయలోని అరోయేరు నుండి గాదు, రూబేను, మనష్షె గోత్రాల ప్రజలు నివసించిన గిలాదు, బాషాను ప్రాంతాల్లో వాళ్ళను హజాయేలు ఓడించాడు.
34 యెహూ చేసిన మిగిలిన పనులూ, అతణ్ణి గూర్చిన మిగతా విషయాలూ, అతని శూరత్వం గూర్చిన విషయాలూ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంచారు. 35 తరువాత యెహూ తన పూర్వీకులతో నిద్రించాడు. అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతని కొడుకు యెహోయాహాజు అతని స్థానంలో రాజు అయ్యాడు. 36 యెహూ షోమ్రోనులో ఇశ్రాయేలును ఇరవై ఎనిమిదేళ్ళు పరిపాలించాడు.
ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు పాలన క్రీ.పూ. 849
1 యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు. 2 ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
3 కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు. 4 అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. 5 ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.
6 అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి. 7 అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.
8 యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా. 9 యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.
యెహోయాషు పాలన, ఎలీషా మరణం
10 యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు.
14 ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.
15 అప్పుడు ఎలీషా “విల్లంబులు తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు. 16 “నీ చెయ్యి విల్లుపై వెయ్యి” అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి 17 “తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు. 18 ఈసారి ఎలీషా “బాణాలు పట్టుకో” అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో “నేలను కొట్టు” అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.
19 అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి “నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు” అని చెప్పాడు.
20 తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు. 21 కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.