యోవాషు విశ్వాసభ్రష్టత్వం, మరణం
క్రీ.పూ. 840
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
17 అటు తరువాత సిరియా రాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు. 18 యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.
15 యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు. 16 అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు. 17 యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు. 18 ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది. 19 అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
20 అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి “మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు” అన్నాడు. 21 అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు. 22 ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు “యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక” అన్నాడు.
23 ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు. 24 అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు.
25 అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు. 26 అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు.
20 అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు. 21 షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
27 యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.
19 యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని యితర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా.
1 యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. 2 యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.
17 అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు. 18 కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్ళారు. దాన్ని ధ్వంసం చేసారు. బయలు గుడిలో బలిపీఠం వేదికలనూ, విగ్రహాలనూ నేలమట్టం చేశారు. బయలు దేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపి వేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు.
19 యెహోయాదా శతాధిపతులనూ, కేరేతీయులనూ, కావలి వారిని ఇంకా ప్రజలందర్నీ పిలిపించాడు. వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకు వచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు. 20 కావలి వారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు.