హిజ్కియా మరణం (continued)

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 37:1–38:8

1 ఆ మాటలు విని హిజ్కియా తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. 2 రాజ గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకుల్లో పెద్దలను ఆమోజు కొడుకు, ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపించాడు. 3 వారంతా గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా ఇలా చెప్పమన్నాడు, ‘ఈ రోజు బాధ, శిక్ష, నిందల రోజు. పిల్లలు పుట్టడానికి సమయం వచ్చిందిగాని కనడానికి తల్లికి శక్తి లేదు. 4 సజీవుడైన దేవుణ్ణి దూషించడానికి తన యజమాని అష్షూరు రాజు పంపిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడు యెహోవా ఒకవేళ విని, ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి ఇప్పటికి బతికి ఉన్న మన కొద్దిమంది కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చెయ్యి.’”

5 హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వచ్చారు. 6 యెషయా వారితో ఇలా అన్నాడు. “మీ యజమానికి ఈ మాట చెప్పండి, యెహోవా ఏమి చెబుతున్నాడంటే, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ పలికిన మాటలకు భయపడవద్దు. 7 అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను. అతడు ఒక పుకారు విని తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని దేశంలోనే కత్తివాత హతం అవుతాడు.”

8 అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడని తెలిసి రబ్షాకే తిరిగి వెళ్ళి అతనితో కలిశాడు. 9 కూషు రాజు తిర్హాకా తనపై యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరురాజు సన్హెరీబు విన్నాడు. అప్పుడు అతడు తన దూతలతో హిజ్కియాకు ఒక సందేశం పంపాడు. 10 “యూదా రాజు హిజ్కియాతో ఇలా చెప్పండి, ‘నీ దేవుని చేతిలో మోసపోయి అష్షూరు రాజు యెరూషలేమును ఆక్రమించలేడని అనుకోవద్దు. 11 అష్షూరు రాజులు సకల దేశాలనూ పూర్తిగా నాశనం చేసిన సంగతి నువ్వు విన్నావు కదా, నీవు మాత్రం తప్పించుకోగలవా? 12 నా పూర్వికులు నిర్మూలం చేసిన గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారులో ఉండే ఏదెనీయులు, వీరిలో ఎవరైనా తమ దేవుళ్ళ సహాయంతో తప్పించుకున్నారా? 13 హమాతు, అర్పాదు, సెపర్వయీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?’”

14 హిజ్కియా ఆ ఉత్తరం తీసుకుని, చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి ఆయన సన్నిధిలో దాన్ని ఉంచాడు. 15 తరువాత ఈ విధంగా ప్రార్థన చేశాడు, 16 “యెహోవా, కెరూబుల మధ్య నివసించే ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశాలను సృష్టించిన అద్వితీయ దేవా, నీవు ఈ లోక రాజ్యాలన్నిటిపై దేవుడివి. 17 సేనల ప్రభువైన యెహోవా, నీ కళ్ళు తెరచి చూసి నా మాటలు ఆలకించు. జీవం గల దేవుడవైన నిన్ను దూషిస్తూ సన్హెరీబు రాసిన మాటలు విను. 18 యెహోవా, అష్షూరు రాజులు వివిధ జాతుల ప్రజలనూ వారి దేశాలనూ నాశనం చేసి వారి దేవుళ్ళను అగ్నిలో వేసింది నిజమే. 19 ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు. 20 యెహోవా, ఈ లోకంలో నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని మనుషులంతా గ్రహించేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు.”

21 అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి ఈ సందేశం పంపాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే”, అష్షూరు రాజు సన్హెరీబు విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేశావు కదా, 22 అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.

23 నువ్వు ఎవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? గర్వంతో ఎవరిని భయపెట్టాలని చూశావు?

పరిశుద్ధుడైన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కదా?

24 నీ దూతల ద్వారా యెహోవాను తిరస్కరించి నువ్వు ఇలా పలికావు, ‘నా గొప్ప రథాల గుంపుతో నేను పర్వత శిఖరాల మీదకీ ఉన్నతమైన లెబానోను స్థలాల పైకీ ఎక్కాను.

ఎత్తయిన దాని దేవదారు చెట్లూ శ్రేష్ఠమైన సరళ చెట్లూ నరికేశాను.

వాటికి బహు దూరంలో సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకి, ఫలవంతమైన అడవిలోకి ప్రవేశించాను.

25 నేను బావులు తవ్వి అక్కడి నీళ్లు తాగాను.

నా అరకాలి కింద ఐగుప్తు నదులన్నిటిని ఎండిపోయేలా చేశాను.’

26 అయితే దీన్ని నేనే ఎప్పుడో నిర్ణయించాననీ, పూర్వకాలంలోనే దీన్ని ఏర్పాటు చేశాననీ నీకు వినబడలేదా?

నువ్వు ప్రాకారాలు గల పట్టణాలను పాడుదిబ్బలుగా చేయడం నా వల్లనే జరిగింది.

27 అందుకే వాటి ప్రజలు బలహీనులై చెదరిపోయారు. భయంతో పొలంలోని గడ్డిలాగా, బలం లేని కాడల్లాగా మారారు.

28 నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు.

29 నా మీద నువ్వు వేసే రంకెలు, నీవు చూపిన అహంకారం నా దాకా వచ్చాయి.

కాబట్టి నీ ముక్కుకి నా గాలం తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను తిప్పి పంపుతాను.”

30 యెషయా ఇంకా ఇలా చెప్పాడు. “హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరం దానంతట అదే పండే ధాన్యాన్నీ, రెండో సంవత్సరంలో దాని నుండి కలిగే ధాన్యాన్నీ మీరు తింటారు.

మూడో సంవత్సరంలో మీరు విత్తనం చల్లి పంట కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటిఫలం అనుభవిస్తారు.

31 యూదా వంశంలో తప్పించుకొన్న శేషం బాగా వేరుతన్ని ఎదిగి ఫలిస్తారు.

32 మిగిలినవారు యెరూషలేములో నుండి, తప్పించుకొన్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరతారు.

సైన్యాల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.

33 కాబట్టి అష్షూరు రాజు గూర్చి యెహోవా చెప్పేది ఏమంటే, ‘అతడు ఈ పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణం కూడా విసరడు.

ఒక్క డాలైనా ఆడించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.

34 ఈ పట్టణం లోపలికి రాకుండా తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి పోతాడు.’

ఇదే యెహోవా వాక్కు.

35 నా నిమిత్తమూ నా సేవకుడైన దావీదు నిమిత్తమూ నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”

36 అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1, 85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు. 37 అష్షూరు రాజు సన్హెరీబు తిరిగి నీనెవె పట్టణానికి వెళ్ళిపోయాడు. 38 ఆ తరవాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరంలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు అద్రమ్మెలెకు, షెరెజెరు అనే అతని కొడుకులు అతణ్ణి కత్తితో చంపి అరారాతు దేశంలోకి పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతనికి బదులుగా రాజయ్యాడు.

38:1 ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు. 2 అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి, 3 “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనేవిధంగా జీవించానో, సమస్తాన్నీ ఏ విధంగా నీ దృష్టికి మంచిదిగా జరిగించానో, కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.

4 అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 5 “నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేదేమంటే నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన అంగీకరించాను. 6 నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను. 7 తాను పలికిన మాట నెరవేరుతుంది అనడానికి యెహోవా నీకిచ్చే సూచన ఇదే, 8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి చేత ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు ఎక్కేలా చేస్తాను.’” అప్పుడు సూర్యకాంతిలో ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మళ్ళీ వెనక్కి జరిగింది.

యెషయా 38:21–39:8

21 యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు. 22 దానికి ముందు హిజ్కియా “నేను మళ్ళీ యెహోవా మందిరానికి వెళతాను అనేదానికి సూచన ఏమిటి?” అని అతణ్ణి అడిగాడు.

39:1 ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు. 2 హిజ్కియా వారిని లోపలికి రప్పించి, తన ఇంటిలో, రాజ్యంలో ఉన్న సమస్త వస్తువుల్లో దేనిని దాచిపెట్టకుండా తన సామగ్రి దాచే గదులు, వెండి బంగారాలు, సుగంధద్రవ్యాలు, పరిమళ తైలం, ఆయుధశాల మొదలైన వాటిలో ఉన్న తన పదార్థాలన్నిటినీ వారికి చూపించాడు.

3 అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? వారు ఎక్కడ నుండి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “వారు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారు” అని చెప్పాడు. 4 “వాళ్ళు నీ ఇంటిలో ఏమేమి చూశారు?” అని అడిగినప్పుడు, హిజ్కియా “నా వస్తువుల్లో దేనినీ దాచకుండా నా ఇంటిలో ఉన్న సమస్తాన్నీ నేను వారికి చూపించాను” అన్నాడు. 5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు. “యెహోవా చెబుతున్న మాట విను. 6 రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. 7 నీ గర్భంలో పుట్టిన నీ కొడుకులను బబులోను రాజనగరంలో నపుంసకులుగా చేయడానికి వారు తీసుకుపోతారు.”

8 అందుకు హిజ్కియా “నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. అయితే నా జీవితకాలమంతటిలో నాకు శాంతిభద్రతలు, క్షేమం ఉండు గాక” అని యెషయాతో అన్నాడు.

2 రాజులు 20:20–21

20 హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 21 హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.