యొర్దాను దాటడం
క్రీ.పూ. 1451
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
10 అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి, 11 ‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’”
12 రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు, 13 “యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు. 14 మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా 15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.”
16 దానికి వారు “నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం. 17 మోషే చెప్పిన ప్రతి మాటా మేము విన్నట్టు నీ మాటా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక. 18 నీమీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు” అని యెహోషువతో చెప్పారు.
1 యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు.
2 మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, 3 “మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి. 4 మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.”
5 యెహోషువ ప్రజలతో “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి” అన్నాడు. 6 అతడు యాజకులతో “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి” అని చెప్పాడు.
వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు. 7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను. 8 మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.”
9 కాబట్టి యెహోషువ “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి” అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి, 10 వారితో ఇలా చెప్పాడు. “సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి 11 జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు.
12 కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి. 13 సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
14 కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. 15 అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే 16 పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. 17 ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.
4:1 ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. 2 “ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని ఏర్పరచి 3 యాజకుల కాళ్లు నిలిచిన స్థలం లో యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని బయటికి తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారి కాజ్ఞాపించు.”
4 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరచిన పన్నెండు మందిని, అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి, 5 వారితో ఇలా అన్నాడు. “యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట నుండి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడూ ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. 6 ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, ‘యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి. 7 యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఈ రాళ్లు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ఉంటాయి’ అని వారితో చెప్పాలి.”
8 యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. 9 అప్పుడు యెహోషువ నిబంధన మందసాన్ని మోసే యాజకుల కాళ్లు యొర్దాను మధ్య నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలబెట్టించాడు. నేటి వరకూ అవి అక్కడ ఉన్నాయి.
10 ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతా, అంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకూ యాజకులు మందసాన్ని మోస్తూ యొర్దాను మధ్య నిలబడగా ప్రజలు త్వరపడి దాటారు. 11 ప్రజలందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసం మోసే యాజకులు దాటారు.
12 ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులూ గాదీయులూ మనష్షే అర్థగోత్రపు వారూ మోషే వారితో చెప్పినట్టు యుద్ధసన్నద్ధులై దాటారు. 13 సేనలో ఇంచుమించు నలభై వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధం చేయడానికి యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు వచ్చారు. 14 ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు.
15 యెహోవా “సాక్ష్యపు మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” 16 అని యెహోషువతో చెప్పినప్పుడు 17 యెహోషువ “యొర్దానులో నుండి ఎక్కి రండి” అని యాజకులకు ఆజ్ఞాపించాడు. 18 యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటిలాగే తమ చోటికి మళ్ళి దాని గట్లన్నిటి మీదా పొర్లి ప్రవహించాయి.
19 మొదటి నెల పదో తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే 20 యొర్దానులో నుండి వారు తెచ్చిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి 21 ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు “రాబోయే కాలంలో మీ సంతానం ‘ఈ రాళ్ళు ఎందుకు’ అని వారి తండ్రులను అడిగితే, 22 అప్పుడు మీరు, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి.
23 యెహోవా బాహువు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోడానికీ 24 మీరు ఎప్పుడూ మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడానికీ, మేము దాటేవరకూ మీ దేవుడు యెహోవా తానే మన ముందు ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండి పోయేలా చేశాడో అలాగే మీరు దాటే వరకూ యొర్దాను నీళ్ళను కూడా ఎండి పోయేలా చేశాడని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి.”