కనానులో నిబంధన పునరుద్ధరణ

నిబంధన పునరుద్ధరించబడింది.

క్రీ.పూ. 1451

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోషువా 5:1–12

1 వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.

2 ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు. 3 యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.

4 యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు. 5 బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు.

6 యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు. 7 ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు.

8 కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు. 9 అప్పుడు యెహోవా “ఈ రోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేశాను” అని యెహోషువతో అన్నాడు. అప్పటినుండి నేటివరకూ ఆ స్థలానికి “గిల్గాలు” అని పేరు.

10 ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగో రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు. 11 పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు. 12 ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు.

యెరికో జయం

యెహోషువా 6:1

1 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.

యెహోషువా 5:13–15

13 యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. 14 అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు.

యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. 15 అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.

యెహోషువా 6:2–27

2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను. 3 మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. 4 అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. 5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.

6 నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు. 7 తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు.

8 యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. 9 యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు.

10 యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. 11 ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు.

12 యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు. 13 ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు. 14 ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.

15 ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు. 16 ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”

17 “ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు. 18 శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు. 19 వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”

20 యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. 21 వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.

22 అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు. 23 వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు. 24 తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు.

25 రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.

26 అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి వారికిలా ఆజ్ఞాపించాడు “ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్దకొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినపుడు వాడి చిన్నకొడుకు మరణిస్తాడు.” 27 యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.