శత్రువులతో సంఘం చేసే గొప్ప పోరాటం

భవిష్యత్తులో సంఘానికి, దాని శత్రువులకు మధ్య జరిగే గొప్ప పోరాటం గురించి, అంత్యదినాల్లో యూదుల విశ్వాస పరివర్తన గురించి ఒక ప్రవచనం.

క్రీ.పూ. 587

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహెజ్కేలు 38–39

1 యెహోవా నాతో ఇలా చెప్పాడు. 2 నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు. 3 “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుడవైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను. 4 నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను. 5 నీతో కూడ పర్షియా, కూషు, పూతు దేశాల వారినీ డాళ్ళు, శిరస్త్రాణాలు ధరించే వారినీ బయలుదేరదీస్తాను. 6 గోమెరు, అతని సైన్యం, ఉత్తరాన ఉండే తోగర్మా, అతని సైన్యం, ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు.”

7 “నీవు సిద్ధంగా ఉండడమే కాక, నీతో కలిసిన ఈ సమూహమంతటిని సిద్ధపరచి వారికి నాయకత్వం వహించు. 8 చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.

9 గాలివాన వచ్చినట్టు, మేఘం కమ్మినట్టు నీవు ఆ దేశం మీదికి వస్తావు. నీవు, నీ సైన్యం, నీతో కలిసిన విస్తారమైన జనాలు ఆ దేశం మీద కమ్ముకుంటారు.” 10 ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఆ కాలంలో నీ మనస్సులో చెడు తలంపులు కలుగుతాయి. 11 నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను. 12 గతంలో పాడై మళ్ళీ నివాసయోగ్యమైన స్థలాల మీదికి వెళ్ళి, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకుంటాను. వివిధ జనాల్లోనుండి తిరిగివచ్చి, పశువులు, ఆస్తులు సంపాదించి, భూమి నట్టనడుమ నివసించే ప్రజల మీదికి వెళ్తాను.

13 సెబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, వారి యోధులందరు నిన్ను చూసి “సొమ్ము దోచుకోడానికి వచ్చావా? కొల్లగొట్టడానికీ వెండి బంగారాలు, పశువులు, సరుకులు పట్టుకుపోడానికీ సైన్యం సమకూర్చుకుని వచ్చావా?” అని అడుగుతారు.

14 “కాబట్టి నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించే సమయం కనిపెట్టావు కదా? 15 దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి 16 మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.” 17 ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే “గతంలో ప్రతి సంవత్సరం నిన్ను వారిమీదికి రప్పిస్తానని నా సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చింది నేనే గదా? 18 ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

19 “కాబట్టి నేను రోషంతో, మహా రౌద్రంతో ఈ విధంగా ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేశంలో గొప్ప భూకంపం కలుగుతుంది. 20 సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి. 21 నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 22 తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను. 23 అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.

39:1 నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను. 2 నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను. 3 నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను. 4 నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు. 5 నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 6 ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.

7 నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను. 8 ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 9 ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి. 10 ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

11 “ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు. 12 దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది. 13 ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు. 14 దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు. 15 దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు. 16 హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”

17 “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు. 18 బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు. 19 మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి. 20 నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 21 నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు. 22 ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు. 23 ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు. 24 వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.

25 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను. 26 వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు. 27 అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. 28 వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు. 29 అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.