ప్రజలను తప్పుదారి పట్టించిన పాలకులను యెహెజ్కేలు ఖండించడం (continued)
ప్రజలను తప్పుదారి పట్టించి వారి నాశనానికి కారకులైన యూదుల పాలకులపై దేవుని కోపాన్ని యెహెజ్కేలు ఇంకా ప్రకటిస్తాడు. తరువాత యూదులు యెరూషలేములో తిరిగి స్థిరపడడం గురించి, క్రీస్తు రాజ్యపు అంతిమ సంతోషం గురించి ముందుగా చెబుతాడు.
క్రీ.పూ. 587
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి. 2 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “మీ గురించి శత్రువులు ఇలా చెప్పారు, ‘ఆహా! ప్రాచీన ఉన్నత స్థలాలు మా సొంతం అయ్యాయి.’ 3 అందుచేత ప్రవచించి ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తూ మిమ్మల్ని పాడుచేశారు. మీరు ఇతర రాజ్యాల వశమయ్యారు. మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి చులకన అయ్యారు.
4 కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా ప్రభువు మాట వినండి. యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో పాడైన స్థలాలతో నిర్జనమైన పట్టణాలతో 5 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, చుట్టూ ఉన్న రాజ్యాలూ ఎదోం వారూ ద్వేష భావంతో ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నందుకు నేను తీవ్ర రోషంతో కచ్చితంగా చెప్పాను. 6 కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచనం చెప్పు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో ఈ మాట చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇతర రాజ్యాలు మిమ్మల్ని అవమానించారు. కాబట్టి రోషంతో కోపంతో దీన్ని వెల్లడిస్తున్నాను.
7 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు అవమానానికి గురి అవుతారు అని నేను మాట ఇస్తున్నాను.
8 ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలోనే ఇశ్రాయేలీయులైన నా ప్రజలు మీ దగ్గరికి వస్తారు. మీరు చిగురుపెట్టి వారి కోసం పళ్ళు కాస్తారు. 9 నేను మీ కోసం ఉన్నాను. నేను మిమ్మల్ని దయతో చూస్తాను. మిమ్మల్ని దున్ని, మీ మీద విత్తనాలు నాటుతారు.
10 మీ మీద ఎంతోమందిని, అంటే ఇశ్రాయేలీయులను విస్తరింప చేస్తాను. పట్టణాల్లో ప్రజలు నివసిస్తారు. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది. 11 మీ పర్వతాల మీద మనుషులూ పశువులూ విస్తారంగా ఉండేలా చేస్తాను. అవి వర్ధిల్లుతూ ఫలిస్తాయి. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి, మునుపటికంటే ఎక్కువ అభివృద్ది కలిగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 12 నా ఇశ్రాయేలీయులు మీ మీద నడుస్తారు. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు వారికి వారసత్వంగా ఉంటారు. వాళ్ళ పిల్లలను ఇక ఎంత మాత్రం మీరు చంపరు.
13 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘దేశమా, నువ్వు మనుషులను తినేస్తున్నావు. నీ రాజ్యాల్లోని పిల్లలు చచ్చిపోయారు’ అని ప్రజలు నీ గురించి చెప్పుకుంటున్నారు. 14 కాబట్టి నువ్విక మనుషులను తినవు. వారి చావుకు నీ దేశం ఏడవదు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. 15 “నీ గురించి రాజ్యాలు ఇక ఎగతాళి చేయరు. వారి తిరస్కారం ఇక ఎన్నటికీ మీరు సహించనవసరం లేదు. మీ వలన ప్రజలు మరెన్నడూ పతనం కాబోరు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
16 యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించినప్పుడు వారి పద్ధతులతో పనులతో దాన్ని అపవిత్రపరచారు. వారి ప్రవర్తన, నా దృష్టిలో రుతుస్రావంలో ఉన్న స్త్రీ అపవిత్రతలాగా ఉంది. 18 కాబట్టి దేశంలో వారు చేసిన హత్యలకూ వారి విగ్రహాలతో దేశాన్ని అపవిత్రపరచినందుకు నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించాను.
19 వారి పద్ధతులను బట్టి వారి పనులను బట్టి వారిని శిక్షించి, నేను వేరే రాజ్యాల్లోకి వారిని వెళ్లగొట్టాను. 20 వారు తాము వెళ్లిన ప్రదేశాల్లో ప్రతి చోటా వారి మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు నిజంగా యెహోవా ప్రజలేనా? ఆయన తన దేశంలో నుంచి ఆయన వాళ్ళను తోసేశాడు అని వారి గురించి చెప్పారు. 21 అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళిన ప్రాంతాల్లో నా పవిత్ర నామం దూషణకు గురి అవుతూ ఉంటే నా పేరు గురించి నేను చింతించాను.”
22 కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను. 23 మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
24 “ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను. 25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
26 కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27 నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28 నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
29 మీ అపవిత్రనంతా పోగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీకు కరువు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా పండేలా చేస్తాను. 30 చెట్లు విస్తారంగా కాయలు కాసేలా, పొలాలు బాగా పంట పండేలా చేస్తాను. అప్పటినుంచి కరువు గురించిన నింద ఇతర రాజ్యాల్లో మీకు రాదు. 31 అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
32 మీ కోసం నేను ఇలా చేయడం లేదని తెలుసుకోండి. ఇదే యెహోవా ప్రభువు సందేశం. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడండి. 33 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ ప్రతి పాపం నుంచి మిమ్మల్ని శుద్ధి చేసే రోజు మీ పట్టణాల్లో మిమ్మల్ని నివసించేలా చేస్తాను. పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది. 34 ఆ వైపుగా వెళ్ళే వారి దృష్టికి పాడుగా నిర్జనంగా కనిపించే భూమిని సేద్యం చేయడం జరుగుతుంది.
35 పాడైన భూమి ఏదెను తోటలా అయింది. పాడుగా నిర్జనంగా ఉన్న ఈ పట్టణాలకు గోడలున్నాయి. అవి ప్రజలతో నిండి ఉన్నాయి, అనుకుంటారు. 36 అప్పుడు నేను, యెహోవాను, పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టించి, నాశనమైన స్థలాల్లో చెట్లు నాటించాననీ మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు. నేను యెహోవాను. నేనే ఈ విషయాన్ని వెల్లడించాను. నేను దాన్ని నెరవేరుస్తాను.”
37 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను. 38 నేను యెహోవానని వారు తెలుసుకునేలా అర్పణగా ఉన్న గొర్రెలంత విస్తారంగా, నియామక దినాల్లో యెరూషలేముకు వచ్చే గొర్రెలంత విస్తారంగా వారి పట్టణాల్లో మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించేలా నేను చేస్తాను.”
37:1 యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. 2 ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. 3 ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
4 అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. 5 ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. 6 మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
7 ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. 8 నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
9 అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా” 10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
11 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు. 12 కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.
13 నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే 14 నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15 యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. 16 నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి. 17 అప్పుడు ఆ రెండూ నీ చేతిలో ఒక్కటయ్యేలా ఒక దానితో ఒకటి జోడించు.
18 వీటి అర్థం ఏంటి? అని నీ ప్రజలు నిన్నడిగితే, వాళ్ళకిలా చెప్పు. 19 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిము చేతిలో ఉన్న కొమ్మ, అంటే ఏ కొమ్మ మీద ఇశ్రాయేలువారందరి పేర్లు, వాళ్ళ తోటివాళ్ళ పేర్లు, నేను ఉంచానో, ఆ యోసేపు అనే ఆ కొమ్మను యూదావాళ్ళ కొమ్మను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన కొమ్మగా చేస్తాను. 20 ఆ రెండు కొమ్మలను వాళ్ళ ఎదుట నువ్వు చేతిలో పట్టుకో.
21 వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను. 22 వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. 23 తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
24 నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు. 25 నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.
26 నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. 27 నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను. 28 వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.