సంఘ భవిష్యత్ మహిమ, విజయం (continued)

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 65–66

1 “నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను.

నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను.

2 మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను.

వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు.

3 తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు.

వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.

4 వాళ్ళు సమాధుల్లో కూర్చుంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు.

తినకూడని మాంసం పులుసుతో, వాళ్ళ పాత్రల్లో పందిమాంసం తింటారు.

5 ‘మా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. నీకంటే నేను పవిత్రుణ్ణి.’ అని వాళ్ళంటారు.

వీళ్ళంతా నా ముక్కుల్లో పొగలాగా రోజంతా మండే నిప్పులాగా ఉన్నారు.

6 యెహోవా ఇలా చెబుతున్నాడు. ఇది నా ఎదుట గ్రంథంలో రాసి ఉంది.

నేను ఊరుకోను. ప్రతీకారం చేస్తాను. తప్పకుండా వీళ్ళను నేను శిక్షిస్తాను.

7 వాళ్ళ పాపాలకూ వాళ్ళ పూర్వీకుల పాపాలకూ వారిని శిక్షిస్తాను.

పర్వతాలమీద ఈ ప్రజలు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండలపై నన్ను దూషించిన దాన్ని బట్టి,

మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను.”

8 యెహోవా ఇలా చెబుతున్నాడు. “ద్రాక్షగెలలో కొత్త రసం ఇంకా కనబడితే

ప్రజలు, ‘దానిలో మంచి రసం ఉంది. దాన్ని నష్టం చేయవద్దు.’ అంటారు.

నా సేవకుల కోసం అలాగే చేస్తాను. నేను వాళ్లందరినీ నాశనం చేయను.

9 యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను. యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకునే వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకున్న వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.

10 నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది.

ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది.

11 అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు.

12 నేను పిలిచినప్పుడు మీరు జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు.

దానికి బదులు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.

కాబట్టి నేను కత్తిని మీకు విధిగా నియమిస్తాను. మీరంతా వధకు లోనవుతారు.”

13 యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు.

“వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు.

నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు.

నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు.

14 నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ

మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు.

15 నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను.

నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను.

16 ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను.

భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు.

ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.

17 ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను.

గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను.

18 అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.

19 నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను.

ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు.

20 కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు.

ముసలివారు కాలం నిండకుండా చనిపోరు.

నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు.

నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు.

21 ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు.

22 వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు.

నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు.

23 వారు వృథాగా ప్రయాసపడరు. దిగులు తెచ్చుకుని పిల్లలను కనరు.

వారు యెహోవా దీవించే ప్రజలుగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు.

24 వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను.

25 తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది.

నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.

66:1 యెహోవా ఇలా చెబుతున్నాడు,

“ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?

2 వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు.

“ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

3 ఎద్దును వధించేవాడు మనిషిని కూడా చంపుతున్నాడు. గొర్రెపిల్లను బలిగా అర్పించే వాడు కుక్క మెడ కూడా విరుస్తున్నాడు.

నైవేద్యం చేసేవాడు పందిరక్తం అర్పించే వాడి వంటివాడే. ధూపం వేసేవాడు విగ్రహాలను గొప్పగా చెప్పుకునే వాడివంటి వాడే.

వాళ్ళు తమ సొంత విధానాలను ఏర్పరచుకున్నారు. తమ అసహ్యమైన పనుల్లో ఆనందిస్తున్నారు.

4 అలాగే, వారికి రావలసిన శిక్షను నేనే ఏర్పరుస్తాను. వాళ్ళు భయపడే వాటినే వారి మీదికి రప్పిస్తాను.

ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరూ వినలేదు.

నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.”

5 యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి.

“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు,

‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’

అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు.

6 పట్టణంలోనుంచి యుద్ధధ్వని వస్తూ ఉంది. దేవాలయం నుంచి శబ్దం వస్తూ ఉంది.

తన శత్రువులకు ప్రతీకారం చేసే యెహోవా శబ్దం వినబడుతూ ఉంది.

7 ప్రసవవేదన పడకముందే ఆమె పిల్లను కనింది.

నొప్పులు రాకముందే కొడుకును కనింది.

8 అలాంటి సంగతి ఎవరైనా విన్నారా? అలాంటివి ఎవరైనా చూశారా?

ఒక్క రోజులో దేశం పుడుతుందా? ఒక్క క్షణంలో ఒక రాజ్యాన్ని స్థాపించగలమా?

అయినా సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె బిడ్డలను కనింది. 9 నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు.

“పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.

10 యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి.

ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి.

11 ఆదరణకరమైన ఆమె చనుపాలు మీరు కుడిచి తృప్తి పడతారు. ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.

12 యెహోవా ఇలా చెబుతున్నాడు,

“నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను.

రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను.

మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.

13 తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.”

14 మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి.

యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.

15 వినండి. మహా కోపంతో ప్రతీకారం చేయడానికి అగ్నిజ్వాలలతో గద్దించడానికి

యెహోవా మంటలతో వస్తున్నాడు. ఆయన రథాలు తుఫానులాగా వస్తున్నాయి.

16 అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు.

17 తోటల్లోకి వెళ్లడానికి వాళ్ళు తమను ప్రతిష్టించుకుని, పవిత్రపరచుకుంటారు.

పందిమాంసాన్నీ అసహ్యమైన పందికొక్కులను తినే వారిని అనుసరిస్తారు.

“వాళ్ళు తప్పకుండా నాశనం అవుతారు.” ఇదే యెహోవా వాక్కు.

18 వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు. 19 నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు.

20 అన్ని రాజ్యాల్లో నుంచి మీ సోదరులందరినీ యెహోవాకు అర్పణగా వాళ్ళు తీసుకు వస్తారు. వారిని గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద కంచర గాడిదల మీద ఒంటెల మీద ఎక్కించి యెరూషలేములోని నా పవిత్ర పర్వతానికి వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యాన్ని యెహోవా మందిరంలోకి తెస్తారు.

21 “యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెబుతున్నాడు.

22 యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను సృజించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి

నా ముందు ఎప్పటికీ ఉన్నట్టు మీ సంతానం, మీ పేరు నిలిచి ఉంటాయి.

23 ప్రతి నెలా ప్రతి విశ్రాంతిరోజున నా ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రజలంతా వస్తారు” అని యెహోవా చెబుతున్నాడు

24 వాళ్ళు బయటికి వెళ్లి నామీద తిరుగుబాటు చేసినవారి శవాలను చూస్తారు.

వాళ్ళను తినే పురుగులు చావవు. వాళ్ళను కాల్చే మంట ఆరిపోదు. వాళ్ళు మనుషులందరికీ అసహ్యంగా ఉంటారు.