సంఘ భవిష్యత్ మహిమ, విజయం (continued)

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 62–64

1 సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ

సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను.

2 రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు.

యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు.

3 నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.

4 నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు.

దాని బదులు నిన్ను “ప్రియమైనది” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి” అనీ అంటారు.

ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది.

5 యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు నిన్ను పెళ్లి చేసుకుంటారు.

పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.

6 యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను.

రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు.

యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు.

7 ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు

లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు.

8 తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు,

“నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు.

9 కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు.

ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.”

10 ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి!

జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి!

రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి!

11 వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు.

“సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు!

ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.”

12 “పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.

63:1 ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు?

రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు?

నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి.

2 నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి?

3 ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు.

కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను.

వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే.

4 పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.

5 సాయం చేసేవాడి కోసం చూశాను. ఎవరూ రాలేదు. ఎవడూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను.

అయితే నా హస్తమే నాకు విజయం సాధించిపెట్టింది. నా ఆగ్రహం నన్ను నడిపించింది.

6 కోపంతో ప్రజలను తొక్కేశాను. నా ఆగ్రహంతో వారికి మత్తెక్కించాను. వారి రక్తాన్ని నేల పారబోశాను.

7 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను.

యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను.

తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను.

8 అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.

9 వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు.

ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు.

పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.

10 అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు.

కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.

11 ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు.

వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి?

వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?

12 మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?

13 తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి?

లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు.

14 లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు.

నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు.

15 పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు.

నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి?

మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి.

16 అయితే మా తండ్రివి నువ్వే.

అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా,

యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా.

17 యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు?

మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు?

నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా.

18 నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు.

19 నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.

64:1 ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి.

2 మంటలు గచ్చ పొదలను తగలబెట్టేలా నీళ్ళు పొంగేలాగా చేసినట్టు నీ పేరు నీ శత్రువులకు తెలియజేయడానికి నువ్వు దిగి రా!

3 మేము ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలు నువ్వు మునుపు చేసినప్పుడు, నువ్వు దిగివచ్చావు. పర్వతాలు నీ ఎదుట వణికాయి.

4 నీ కోసం ఎదురు చూసేవారి పక్షంగా నువ్వు పనులు చేసే వాడివి. నిన్ను తప్ప తన పని ఇలా జరిగించే వేరే దేవుణ్ణి అనాది కాలం నుంచి ఎవరూ చూడలేదు, వినలేదు, గ్రహించలేదు.

5 నీ పద్ధతులను గుర్తుంచుకుని వాటి ప్రకారం చేసే వారికి, సంతోషంతో నీతి ననుసరించే వారికి, నువ్వు సాయం చేయడానికి వస్తావు.

మేము పాపం చేసినప్పుడు నువ్వు కోపపడ్డావు. నీ పద్ధతుల్లో మాకు ఎప్పుడూ విడుదల కలుగుతుంది.

6 మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి.

మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం.

7 నీ పేరున ఎవరూ ప్రార్థన చేయడంలేదు. నిన్ను ఆధారం చేసుకోడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే మాకు కనబడకుండా నువ్వు నీ ముఖం దాచుకున్నావు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించావు.

8 అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి.

మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని.

9 యెహోవా, ఎక్కువగా కోపపడవద్దు. మా పాపాలను ఎప్పుడూ అదే పనిగా గుర్తు పెట్టుకోవద్దు.

ఇదిగో, నీ ప్రజలైన మావైపు దయచేసి చూడు.

10 నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి.

సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది.

11 మా పూర్వీకులు నిన్ను కీర్తించిన మా అందమైన పరిశుద్ధ మందిరం అగ్నికి ఆహుతి అయింది.

మాకు ప్రియమైనవన్నీ శిథిలమైపోయాయి.

12 యెహోవా, వీటిని చూసి నువ్వెలా ఊరకుంటావు? నువ్వు మౌనంగా ఉండి మమ్మల్ని బాధపెడుతూ ఉంటావా?