సమూయేలుకు పిలుపు
క్రీ.పూ. 1143
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు. 2 ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు. 3 దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. 4 అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు “అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
5 ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి “నన్ను పిలిచావు గదా, వచ్చాను” అన్నాడు. ఏలీ “నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు. 6 యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి “అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను” అన్నాడు. అందుకు అతడు “బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అని చెప్పాడు.
7 అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. 8 యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి “అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను” అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు.
9 అతడు “నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, ‘యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి’ అని చెప్పు” అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు.
10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా “సమూయేలూ సమూయేలూ” అని పిలిచినప్పుడు సమూయేలు “నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి” అన్నాడు. 11 అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి.
12 ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను. 13 తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను. 14 కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.”
15 తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు. 16 అయితే ఏలీ “సమూయేలూ, కుమారా” అని సమూయేలును పిలిచాడు. అతడు “చిత్తం, నేనిక్కడ ఉన్నాను” అన్నాడు.
17 ఏలీ “నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక” అనగా, 18 సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ “చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక” అన్నాడు.
19 సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. 20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు. 21 షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్ష పరచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయింది.
సంసోను వివాహం చేసుకుని ఫిలిష్తీయులతో పోరాడడం క్రీ.పూ. 1136
సంసోను వివాహం, ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా అతని సాహసకృత్యాలు.
1 సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. 2 అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు. 3 వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు. 4 అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
5 తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది. 6 యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
7 అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది. 8 కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి. 9 అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
10 సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు. 11 ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు. 12 అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను. 13 ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
14 అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు.
అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు. 15 ఏడవ రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
16 సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది. 17 ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
18 ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు. 19 యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు. 20 సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.