సంసోను వివాహం చేసుకుని ఫిలిష్తీయులతో పోరాడడం (continued)
సంసోను వివాహం, ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా అతని సాహసకృత్యాలు.
క్రీ.పూ. 1136
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. “నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను” అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు. 2 ఆమె తండ్రి “నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను. అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందకత్తె గదా. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో” అన్నాడు. 3 అప్పుడు సంసోను వారితో “ఈ సారి నేను ఫిలిష్తీయులకు కీడు చేసినా నిర్దోషి గానే ఉంటాను” అన్నాడు.
4 సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు. 5 ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి. 6 ఫిలిష్తీయులు “ఎవడు చేసాడిలా” అన్నారు. “తిమ్నాతు వాడి అల్లుడైన సంసోను చేశాడు. ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతు వాడు అతని స్నేహితుడికిచ్చాడు” అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెనూ ఆమె తండ్రినీ సజీవ దహనం చేశారు.
7 అప్పుడు సంసోను “మీరు ఇలా చేశారు గనక, నేనూ మీ మీద పగ తీర్చుకునే దాకా ఊరుకోను” అని చెప్పాడు. 8 అతడు వారి తొడలనూ తుంటి ఎముకలనూ విరగగొట్టి ముక్కలు చేసి అనేకమందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు.
9 అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు. 10 యూదాప్రజలు వారిని “మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు “సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి” అన్నారు.
11 అప్పుడు యూదా వారిలో మూడువేలమంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు “ఫిలిష్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు” అన్నారు. దానికి సంసోను “వాళ్ళు నాకేం చేసారో నేనూ వాళ్ళకూ అదే చేసాను” అన్నాడు. 12 దానికి వారంతా “మేము నిన్ను కట్టి పడేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం” అన్నారు. అందుకు సంసోను “మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చేయండి” అన్నాడు. 13 అందుకు వారు “మేము నిన్ను చంపం. కేవలం తాళ్ళతో బంధించి వాళ్లకి అప్పగిస్తాం” అన్నారు. ఇలా చెప్పి వారు అతణ్ణి కొత్తగా పేనిన తాళ్ళతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు.
14 అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కోడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడి పడ్డాయి. 15 అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో వెయ్యి మందిని కొట్టి చంపాడు.
16 అప్పుడు సంసోను ఇలా అన్నాడు, “నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా, గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.”
17 అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి “రామత్లేహి” అనే పేరు పెట్టాడు. 18 అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను” అంటూ వేడుకున్నాడు.
19 అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.
ఏలీ దగ్గరికి ఒక ప్రవక్త పంపబడడం క్రీ.పూ. 1117
22 ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు, 23 “ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు? 24 నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.
25 మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు. 26 బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.
27 ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను. 28 అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.
29 నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు. 30 నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’
31 జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు. 32 నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు, 33 నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.
34 నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు. 35 తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.
36 అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”