కాలం 3: మోషే జననం నుండి మరణం వరకు
భాగం 1: మోషే జననం, తొలి జీవితం
క్రీ.పూ. 1571
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. 2 ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది. 3 ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది. 4 పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.
5 ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6 పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. 7 అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. 8 ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. 9 ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
10 ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు మోషే” అని చెప్పింది.
11 మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. 12 అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
13 తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు. 14 అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు.
ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. 15 ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
16 మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు. 17 అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
18 వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19 అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు. 20 అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
21 మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. 22 వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
23 ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. 24 దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. 25 దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
ఒక పాట, కోరహు వారసుల కీర్తన. ప్రధాన సంగీతకారుని కోసం, మహలతు లయన్నోతు అనే రాగంతో పాడేది. ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ (దైవ ధ్యానం)
1 యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.
2 నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.
3 నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది.
4 సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
5 చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
6 నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
7 నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. సెలా.
8 నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
9 బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
10 మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? సెలా.
11 సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
12 చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
13 అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
14 యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
15 చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
16 నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.
17 నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి.
18 నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.