భాగం 2: మోషేకు బాధ్యత అప్పగించబడడం

దేవుని దూతగా మోషేకు బాధ్యత అప్పగించబడడం.

క్రీ.పూ. 1491

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నిర్గమకాండం 3:1–4:28

1 మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. 2 అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.

3 అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. 4 దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 5 అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు. 6 ఆయన ఇంకా “నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి” అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.

7 యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. 8 కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. 9 నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. 10 నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”

11 అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు. 12 దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు. 13 మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు.

14 అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. 15 దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.

16 నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను. 17 ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను’ అని చెప్పాడని వారితో చెప్పు. 18 వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి.

19 ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు. 20 అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. 21 మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను. 22 ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు” అన్నాడు.

4:1 అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు.

2 యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు.

3 అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.

4 అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.

5 ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు.

6 తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.

7 తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.

8 అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. 9 ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.

10 మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.

11 అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా. 12 కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను” అని మోషేతో చెప్పాడు.

13 మోషే “ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు” అన్నాడు. 14 అందుకు యెహోవా మోషే మీద కోపపడి “లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు. 15 నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను. 16 అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క. 17 ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి” అని చెప్పాడు.

18 ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు. 19 అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో “నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు” అని చెప్పాడు. 20 మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. 22 అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు. 23 నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు’ అని అతనితో చెప్పాలి” అన్నాడు.

24 ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. 25 మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది. 26 అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది.

27 మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. 28 అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు.