రచనాకాలం అనిశ్చితమైన, దావీదు పాలనలోని కీర్తనలు

రాజైన తరువాత దావీదు రాసిన కీర్తనలు; వాటి రచనాకాలం, సందర్భాలు కచ్చితంగా తెలియవు.

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 6

ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యంతో, షేమినిత్ రాగంలో దావీదు కీర్తన.

1 యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.

2 యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.

3 నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?

4 యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.

5 మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు?

6 నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను.

7 విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది.

8 పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు.

9 కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.

10 నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.

కీర్తనలు 8

ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం.

1 యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

2 శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.

3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?

5 అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.

6 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.

7 గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,

8 ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.

9 యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

కీర్తనలు 12

ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. షేమినిత్ రాగం.

1 యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు.

2 అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.

3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.

4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.

5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.

6 యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.

7 నువ్వు యెహోవావు! నువ్వు వాళ్ళను కాపాడతావు. భక్తిగల వాళ్ళను ఈ దుర్మార్గపు తరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు.

8 మనుషుల్లో చెడుతనం ప్రబలినప్పుడు, దుర్మార్గులు అన్నివైపులా తిరుగుతారు.

కీర్తనలు 19

ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన.

1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!

2 రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.

3 వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.

4 అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.

5 సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.

6 ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.

8 యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.

9 యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.

10 అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.

11 వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

12 తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.

13 దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.

14 యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.

కీర్తనలు 23

దావీదు కీర్తన.

1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

6 కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.