రచనాకాలం అనిశ్చితమైన, దావీదు పాలనలోని కీర్తనలు (continued)

రాజైన తరువాత దావీదు రాసిన కీర్తనలు; వాటి రచనాకాలం, సందర్భాలు కచ్చితంగా తెలియవు.

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 24

దావీదు కీర్తన.

1 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

6 ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా.

7 మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.

8 మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.

9 మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.

10 మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. సెలా.

కీర్తనలు 28–29

దావీదు కీర్తన.

1 యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను.

2 నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.

3 దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.

4 వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు.

5 యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు.

6 యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!

7 యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.

8 యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.

9 నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.

దావీదు కీర్తన.

29:1 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!

2 యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.

3 యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.

4 యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.

5 యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.

6 ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు.

7 యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.

8 యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.

9 యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.

10 యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.

11 యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.

కీర్తనలు 38

దావీదు కీర్తన, జ్ఞాపకం కోసం

1 యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు.

2 నీ బాణాలు నాకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. నీ చెయ్యి నన్ను అణచివేస్తుంది.

3 నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది.

4 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి.

5 మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.

6 నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది.

7 అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది.

8 నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.

9 ప్రభూ, నా హృదయపు లోతుల్లోని తీవ్ర ఆకాంక్షలు నువ్వు అర్థం చేసుకుంటావు. నా మూల్గులు నీకు వినిపిస్తూనే ఉన్నాయి.

10 నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది.

11 నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు.

12 నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు

13 కానీ నేను చెవిటివాడిలాగా ఏమీ వినకుండా ఉన్నాను. మూగవాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను.

14 ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.

15 యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు.

16 నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు.

17 నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.

18 నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను.

19 కానీ నా శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు. అన్యాయంగా నన్ను ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు.

20 నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు.

21 యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు.

22 ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.