క్రీస్తు అందరి రక్షకుడని పేతురు ప్రకటించడం

క్రీస్తు తనలో విశ్వాసముంచే వారందరికీ, యూదేతరులకు కూడా రక్షకుడని పేతురు మొదటిసారిగా ప్రకటిస్తాడు.

సుమారు క్రీ.శ. 40

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అపోస్తలుల కార్యములు 10:34–43

34 “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. 36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. 37 యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.

39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.

కొర్నేలి, అతని స్నేహితులు పరిశుద్ధాత్మను పొందడం

కొర్నేలి, అతని స్నేహితులు పరిశుద్ధాత్మను పొంది బాప్తిస్మం పొందుతారు.

అపోస్తలుల కార్యములు 10:44–48

44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46 ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47 అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.

కొర్నేలికి బాప్తిస్మం ఇవ్వడాన్ని పేతురు సమర్థించడం

కొర్నేలిని సందర్శించి అతనికి బాప్తిస్మం ఇవ్వడంలో తాను చేసిన పనిని పేతురు సమర్థించుకుంటాడు.

అపోస్తలుల కార్యములు 11:1–18

1 యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు. 2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, 3 “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.

4 అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ, 5 “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది. 6 దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.

7 అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. 8 అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను. 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది. 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.

11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. 12 అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు. 14 నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.

15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16 అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.

17 “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. 18 వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.

చెదరిపోయిన విశ్వాసులు భక్తిగల యూదేతరులకు బోధించడం క్రీ.శ. 41

స్తెఫను మరణం తరువాత వచ్చిన హింస వల్ల చెదరిపోయిన విశ్వాసులు పేతురు దర్శనం గురించి విని, భక్తిగల యూదేతరులకు కూడా బోధిస్తారు.

అపోస్తలుల కార్యములు 11:19–21

19 స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. 20 వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. 21 ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.