భాగం 2: భక్తిగల యూదేతరులకు సువార్త బోధించడం
ఇప్పటికి యెరూషలేము, యూదయ, సమరయ, ఇతర ప్రాంతాల్లోని యూదులకు సువార్త బోధించబడింది. భక్తిగల యూదేతరులు, అంటే ద్వార ప్రవిష్టులు విశ్వాసంలోకి వచ్చే సమయం వస్తుంది.
ఒక దర్శనం పేతురును యూదేతరుని దగ్గరకు పంపడం
పేతురు ఒక దర్శనం చూస్తాడు. అందులో అతడు ఒక యూదేతరుణ్ణి సందర్శించాలని ఆజ్ఞ పొందుతాడు. పేతురును పిలిపించమని ఆ యూదేతరునికి ఒక అద్భుతం ద్వారా చెప్పబడింది.
సుమారు క్రీ.శ. 40
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. 2 అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 3 మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. 4 అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. 5 ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. 6 అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.
7 ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి తన ఇంట్లో పని చేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి 8 వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు.
9 తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు. 10 అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై, 11 ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు. 12 దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి.
13 అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. 14 అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. 15 “దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది. 16 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
రోమీయ శతాధిపతియైన కొర్నేలిని పేతురు సందర్శించడం
17 పేతురు తనకు వచ్చిన దర్శనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూ అయోమయంలో ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి, తలుపు దగ్గర నిలబడి 18 “పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?” అని అడిగారు.
19 పేతురు ఆ దర్శనాన్ని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఆత్మ, “చూడు, ముగ్గురు వ్యక్తులు నీ కోసం చూస్తున్నారు. 20 నీవు లేచి కిందికి దిగి వారితో పాటు వెళ్ళు. వారితో వెళ్ళడానికి సంకోచించవద్దు. వారిని నేనే పంపాను” అని అతనితో చెప్పాడు. 21 పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వెళ్ళి, “మీరు వెదికే వాణ్ణి నేనే. మీరెందుకు వచ్చారు?” అని అడిగాడు.
22 అందుకు వారు, “నీతిమంతుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరి దగ్గరా మంచి పేరు సంపాదించిన శతాధిపతి కొర్నేలి అనే ఒకాయన ఉన్నాడు. తన ఇంటికి నిన్ను పిలిపించుకుని నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత అతనికి తెలియజేశాడు” అని చెప్పారు. అప్పుడు పేతురు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చాడు.
23 తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు. 24 ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు.
25 పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు అతనిని లేపి “లేచి నిలబడు. నేను కూడా మనిషినే” అని చెప్పాడు. 27 అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు.
28 అప్పుడతడు, “అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషిద్ధమైన వాడుగా, అపవిత్రుడుగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. 29 కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు” అని కొర్నేలితో చెప్పాడు.
30 అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి 31 ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి 32 పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. 33 వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు.
అందుకు పేతురు ఇలా అన్నాడు,