యూదాను ధ్వంసం చేసిన పెకహు

క్రీ.పూ. 741

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 28:4–19

4 అతడు ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కింద, బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు.

5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతణ్ణి అరాము రాజు చేతికి అప్పగించాడు. అరామీయులు అతణ్ణి ఓడించి అతని ప్రజల్లో చాలమందిని బందీలుగా తీసుకుని దమస్కు తీసుకుపోయారు. యెహోవా అతణ్ణి ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఆ రాజు అతణ్ణి ఓడించాడు. 6 రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది.

7 జిఖ్రీ అనే పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడు రాజ కుమారుడు మయశేయానూ రాజ భవన అధికారి అజ్రీకామునూ రాజు తరువాత ప్రముఖుడు ఎల్కనానూ చంపేసాడు. 8 ఇశ్రాయేలువారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ 2,00,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు.

9 అయితే యెహోవా ప్రవక్త ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఓదేదు. అతడు షోమ్రోనుకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్ళాడు. వారితో ఇలా చెప్పాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించాడు. కాబట్టి ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు మిన్నంటే క్రోధంతో వారిని చంపేశారు. 10 ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా? 11 అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.”

12 అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దల్లో యోహానాను కొడుకు అజర్యా, మెషిల్లేమోతు కొడుకు బెరెక్యా, షల్లూము కొడుకు యెహిజ్కియా, హద్లాయి కొడుకు అమాశా అనేవారు యుద్ధం నుంచి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇలా అన్నారు. 13 “యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.”

14 కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు ఆ బందీలనూ కొల్లసొమ్మునూ విడిచిపెట్టారు. 15 పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు.

16 ఆ కాలంలో ఎదోమీయులు మళ్ళీ వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. 17 రాజైన ఆహాజు తనకు సహాయం చేయమని అష్షూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు. 18 ఫిలిష్తీయులు మైదానాల ప్రాంతంలోని పట్టణాలనూ యూదాలోని నెగేవునూ ఆక్రమించారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో దాని గ్రామాలనూ తిమ్నా దాని గ్రామాలనూ గిమ్జో దాని గ్రామాలనూ ఆక్రమించుకుని అక్కడ నివసించారు.

19 ఆహాజు యూదాదేశంలో విగ్రహాలను పూజించి యెహూవా పట్ల ద్రోహం చేశాడు కాబట్టి యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దాన్నిబట్టి యూదాను అణచివేశాడు.

ఓబద్యా 1

1 ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు. 2 నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.

3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు. 4 గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.

5 దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు. 6 ఏశావు వంశం వారిని పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా దోపిడీ అవుతుంది.

7 నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకూ పంపేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించి ఓడిస్తారు. నీ అన్నం తిన్నవాళ్ళు నిన్ను పట్టుకోడానికి వల వేస్తారు. ఎదోము అర్థం చేసుకోలేడు. 8 ఆ రోజు నేను ఏశావు పర్వతాల్లో తెలివి లేకుండా చేయనా? ఎదోములోని జ్ఞానులను నాశనం చేయనా? అని యెహోవా చెబుతున్నాడు. 9 తేమానూ, నీ శక్తిమంతులకు భయం వేస్తుంది. అందుచేత ఏశావు పర్వతాల్లో నివసించేవారంతా హతమవుతారు.

10 నీ సోదరుడు యాకోబుకు నువ్వు చేసిన దౌర్జన్యానికి నీకు అవమానం కలుగుతుంది. ఇక ఎప్పటికీ లేకుండా నువ్వు నిర్మూలమైపోతావు. 11 నువ్వు దూరంగా నిల్చున్న రోజున, వేరే దేశం వాళ్ళు అతని ఆస్తిని తీసుకుపోయిన రోజున, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి యెరూషలేము మీద చీట్లు వేసిన రోజున నువ్వు కూడా వారిలో ఒకడిగా ఉన్నావు.

12 నీ సోదరుని దినాన, అతని దురవస్థ దినాన నువ్వు ఆనందించవద్దు. యూదావారి నాశన దినాన వారి స్థితి చూసి సంతోషించ వద్దు. వారి ఆపద్దినాలో అతిశయించ వద్దు. 13 నా ప్రజల విపత్తు రోజున వారి గుమ్మాల్లో ప్రవేశించ వద్దు. వారి ఆపద్దినాలో సంతోషిస్తూ వారి బాధ చూడ వద్దు. వారి విపత్తు రోజున వారి ఆస్తిని దోచుకోవద్దు. 14 వారిలో తప్పించుకున్న వారిని చంపేయడానికి అడ్డదారుల్లో నిలబడ వద్దు. ఆపద్దినాలో వారిలో మిగిలే వారిని శత్రువుల చేతికి అప్పగించవద్దు.

15 రాజ్యాలకూ యెహోవా దినం దగ్గర పడింది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకూ చేస్తారు. నువ్వు చేసిన పనులు నీ తల మీదికి తిరిగి వస్తాయి. 16 మీరు నా పవిత్ర పర్వతం పై తాగినట్టు రాజ్యాలన్నీ ఎప్పుడూ తాగుతూ ఉంటాయి. తాము ఎన్నడూ ఉనికిలో లేని వారి లాగా ఉండి తాగుతుంటారు.

17 అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు. 18 యాకోబు వంశం వారు నిప్పులా, యోసేపు వంశం వారు మంటలా ఉంటారు. ఏశావు వంశం వారు ఎండు గడ్డిలా ఉంటారు. నిప్పు వారిని కాల్చేసి దహించేస్తుంది. ఏశావు వంశంలో ఎవరూ మిగలరు, అని యెహోవా చెప్పాడు.

19 దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. మైదాన ప్రాంతాల్లో ఉండే వారు ఫిలిష్తీయుల దేశాన్నిస్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఎఫ్రాయిం ప్రజల భూములనూ సమరయ ప్రజల భూములనూ స్వాధీనం చేసుకుంటారు. బెన్యామీను ప్రజలు గిలాదు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. 20 ఇశ్రాయేలీయుల్లో బందీలుగా దేశాంతరం పోయినవారు సారెపతు వరకూ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెరూషలేము వారిలో బందీలుగా సెఫారాదుకు పోయిన వారు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. 21 ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.

యెషయా 1:2–31

2 ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.

“నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు.

3 ఎద్దుకు తన యజమాని తెలుసు.

తన మేత తొట్టి గాడిదకు తెలుసు.

కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.”

4 ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా,

దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ.

వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు.

ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు.

ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు.

5 మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?

మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?

మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే.

6 అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.

ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు.

అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు,

కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.

7 మీ దేశం పాడైపోయింది.

మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి.

మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు.

తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు.

8 సీయోను కుమార్తె ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా,

దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది.

9 జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,

మనం సొదొమలాగా ఉండేవాళ్ళం.

మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.

10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.

గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.

11 “యెహోవా ఇలా అంటున్నాడు.

విస్తారమైన మీ బలులు నాకెందుకు?”

“దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి.

దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.

12 మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,

నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు?

13 అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.

అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.

వాటిని సహించలేక విసిగిపోయాను.

15 మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.

మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను.

మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.

16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.

మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.

మీ దుష్టత్వం మానండి.”

17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

వితంతువు పక్షాన నిలబడండి.

18 యెహోవా ఇలా అంటున్నాడు.

“రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”

“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,

అవి మంచులా తెల్లగా అవుతాయి.

కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

19 మీరు ఇష్టపడి నాకు లోబడితే,

మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.

20 తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,

కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”

యెహోవా నోరు ఈ మాట పలికింది.

21 నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!

అది న్యాయంతో నిండి ఉండేది.

నీతి దానిలో నివాసం ఉండేది.

ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.

22 నీ వెండి మలినమైపోయింది.

నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.

23 నీ అధికారులు ద్రోహులు.

వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు.

అందరూ లంచం ఆశిస్తారు.

చెల్లింపుల వెంటబడతారు.

తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు.

వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.

24 కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు.

“వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను.

నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను.

25 నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను.

నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను.

26 మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను.

ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను.

అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.”

27 సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది.

28 అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు.

యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు.

29 “మీరు కోరుకున్న సింధూర వృక్షాలను బట్టి మీరు సిగ్గుపడతారు.

మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు.

30 మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు.

31 బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు.

అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి.

ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.”