తిగ్లతు పిలేసెరుతో ఆహాజు మైత్రి

అష్షూరు రాజైన తిగ్లతు పిలేసెరుతో ఆహాజు మైత్రి చేసుకుంటాడు.

క్రీ.పూ. 740

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 16:6–9

6 ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి, ఏలతులోనుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.

7 ఇది ఇలా ఉండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనవీ, రాజనగరు సంబంధమైనవీ అయిన సామానుల్లో కనబడిన వెండి బంగారాలను తీసుకుని అష్షూరు రాజుకు కానుకగా పంపి, 8 “నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి గనుక నీవు వచ్చి, నా మీద దండెత్తిన సిరియా రాజు చేతిలో నుంచి, ఇశ్రాయేలురాజు చేతిలో నుంచి నన్ను రక్షించాలి” అని అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు దగ్గరికి వార్తాహరులను పంపాడు. 9 అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెర పట్టుకుని, రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు.

యెషయా 28

1 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ.

అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.

2 వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు.

అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.

3 ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.

4 పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం

కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది.

మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.

5 ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.

6 ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.

7 అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు.

యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది.

మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.

8 వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.

9 వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?

10 ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.

11 అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.

12 గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు.

కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.

13 “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం,

ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.”

14 కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.

15 మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.”

16 దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.

“చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి.

ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.

17 నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి.

మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.

18 చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు.

వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు.

19 అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి.

ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది.

ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది.

20 పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.

21 యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి

పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.

22 కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి.

సేనల ప్రభువైన యెహోవా నుండి భూమిపైన నాశనం జరుగుతుందనే సమాచారం నేను విన్నాను.

23 కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.

24 రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?

25 అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా?

గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా?

26 అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.

27 జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు.

కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.

28 మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా!

గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!

29 దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు.

ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”

2 దినవృత్తాంతాలు 28:20–23

20 అష్షూరురాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి బలపరచడానికి బదులు బాధపరచాడు. 21 ఆహాజు, యెహోవా మందిరంలో నుంచి, రాజ భవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు, కానీ దాని వల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేక పోయింది.

22 తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు. 23 ఎలాగంటే “అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి.

2 రాజులు 16:10–18

10 రాజైన ఆహాజు అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వచ్చి, దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని పనితనం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు. 11 యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు పట్టణం నుంచి పంపిన నమూనాకు సరిపడిన బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు దమస్కు నుంచి తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు. 12 అప్పుడు రాజు దమస్కు నుంచి వచ్చి బలిపీఠాన్ని చూసి, ఆ బలిపీఠం సమీపించి, ఎక్కి, 13 దహన బలి, నైవేద్యం అర్పించి, పానార్పణం చేసి, తాను అర్పించిన సమాధానబలి పశువుల రక్తాన్ని దాని మీద చల్లాడు. 14 ఇంకా, యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలివేదికను మందిరం ముందున్న స్థలం నుంచి, అంటే, తాను కట్టించిన బలిపీఠానికీ, యెహోవా మందిరానికీ మధ్య నుంచి తొలగించి, తాను కట్టించిన దానికి ఉత్తరం వైపు దాన్ని ఉంచాడు.

15 అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులూ, సాయంత్రం అర్పించే నైవేద్యాలూ రాజు చేసే దహనబలి, నైవేద్యాలూ, దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు, నైవేద్యాలూ, పానార్పణలూ ఇంకా ఏ దహనబలి జరిగినా, అ బలి పశువుల రక్తాన్ని దాని మీదే చల్లాలి. అయితే, నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఇత్తడి బలిపీఠం ఉండాలి” అన్నాడు. 16 యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు.

17 ఇంకా, ఆహాజు రాజు కదిలే పీట మీది నుండి తొట్టిని పక్కన ఉండే పలకలను తీయించాడు. కంచు ఎద్దుల మీద ఉన్న గంగాళాన్ని దింపి, రాతి అరుగు మీద దాన్ని ఉంచాడు. 18 ఇంకా అతడు అష్షూరు రాజుకు భయపడి విశ్రాంతి దినం ఆచరణ కోసం మందిరంలో కట్టి ఉన్న మంటపాన్ని, రాజు ప్రాంగణంలోనుంచి వెళ్ళే దారిని యెహోవా మందిరం నుంచి తీసేశాడు.

2 దినవృత్తాంతాలు 28:24–25

24 ఆహాజు దేవుని మందిరపు సామాను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు. 25 యూదాదేశంలోని పట్టణాలన్నిటిలో అతడు అన్యుల దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి, తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు.

హోషేయ 5

1 యాజకులారా, నామాట వినండి.

ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను.

రాజ వంశమా, విను.

మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు.

కాబట్టి మీ అందరిపైకీ తీర్పు రాబోతున్నది.

2 తిరుగుబాటుదారులు తీవ్రంగా వధ జరిగించారు. కాబట్టి నేను వారందరినీ శిక్షిస్తాను.

3 ఎఫ్రాయిమును నేనెరుగుదును.

ఇశ్రాయేలువారు నాకు తెలియని వారు కారు.

ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వేశ్యవయ్యావు.

ఇశ్రాయేలువారు మైలబడి పోయారు.

4 వారు నా దగ్గరికి రాకుండా వారి క్రియలు అడ్డుపడుతున్నాయి.

వారిలో వ్యభిచార మనసుంది. నన్ను, అంటే యెహోవాను వారు ఎరుగరు.

5 ఇశ్రాయేలు వారి గర్వం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది.

ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు తమ దోషంలో చిక్కుకుపోయి తొట్రుపడుతున్నారు.

వారితోబాటు యూదావారు కూడా తొట్రిల్లుతున్నారు.

6 వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని,

ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు.

7 వారు యెహోవాకు విశ్వాసఘాతకులయ్యారు. అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి.

8 గిబియాలో బాకా ఊదండి.

రమాలో భేరీనాదం చెయ్యండి.

“బెన్యామీనూ, మేము మీతో వస్తున్నాం” అని బేతావెనులో కేకలు పెట్టండి.

9 శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది.

తప్పనిసరిగా జరగబోయే దాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను.

10 యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసేసే వారిలా ఉన్నారు.

నీళ్లు ప్రవహించినట్టు నేను వారిపై నా ఉగ్రత కుమ్మరిస్తాను.

11 ఎఫ్రాయిమీయులు నలిగి పచ్చడైపోయారు.

తీర్పు వల్ల వారు సమూల నాశనమయ్యారు.

ఎందుకంటే వారు విగ్రహాలకు వంగి నమస్కరిస్తూ నడుచుకుంటున్నారు.

12 ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా,

యూదావారికి కుళ్లిపోజేసే వ్యాధి లాగా నేను ఉంటాను.

13 తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు.

తన పుండును యూదా చూశాడు.

ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు.

ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు.

అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు.

నీ పుండు నయం చేయలేకపోయాడు.

14 ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహం లాగా ఉంటాను.

యూదావారికి కొదమ సింహం వలే ఉంటాను.

నేనే వారిని చీల్చేసి వెళ్ళిపోతాను. నేనే వారిని తీసుకుపోతాను.

వారిని విడిపించే వాడొక్కడు కూడా ఉండడు.

15 వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదికే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను.

తమ దురవస్థలో వారు నన్ను మనస్ఫూర్తిగా వెదికే సమయం దాకా నేను వదిలిపెట్టను.